Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరిపై బీజేపీ, టీఆర్ఎస్ తీరిది
- మంత్రులను ఆహ్వానించలేదన్న కేంద్ర మంత్రి
- పీయూష్ గోయల్ ఎదురుదాడిపై మంత్రుల రణమేది?
- రాతపూర్వకంగా హామీ ఇస్తేనే ఇక్కడి నుంచి పోతామన్న నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో - హైదరాబాద్
వరిధాన్యం కొనుగోలుపై బీజేపీ, టీఆర్ఎస్ బంతాట ఆడుతున్నాయి. 'కేంద్రం తేల్చదు...రాష్ట్ర మంత్రుల బృందం గట్టిగా కొట్లాడదు' అన్న పరిస్థితి నెలకొంది. ధాన్యం కొనుగోలు అంశాన్ని రెండు పార్టీలు రాజ కీయ ఎజెండాగా మార్చాయి. ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా చావు డప్పులు కొట్టింది. కేంద్రాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం బదనాం చేస్తున్నదంటూ బీజేపీ ఢిల్లీలో గగ్గోలు పెడుతున్నది. ఉప్పుడు బియ్యం ప్రజలు తినడం లేదనీ, రా రైస్ ఎంతైనా కొంటామని కేంద్ర మంత్రి పియూష్గోయల్ చెబుతున్నారు. అయితే, రాష్ట్రంలో ప్రధాన సమస్యగా మారిన ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేంద్రం ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. యాసంగి పంటలో ఎంత ధాన్యం? ఏ రూపంలో కొనుగోలు చేస్తారో? చెప్పలేదు. అయితే, ఈ విషయాన్ని సమర్థ వంతంగా తిప్పికొట్టకుండా రాష్ట్ర మంత్రులు చేతులెత్తేశారు. రాష్ట్ర మంత్రులు ఏ అంశాన్ని ప్రస్తావించడానికి ఢిల్లీకి వెళ్లారో కూడా స్పష్టత లేదనే విషయం తేటతెల్లమైంది. దీన్ని బీజేపీ అవకాశంగా తీసుకుంటున్నది. అందులో భాగంగానే రాష్ట్ర మంత్రులు ఢిల్లీలో ఉండగానే కేంద్రహౌంమంత్రి అమిత్‌షా తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలతో సమావేశమ య్యారు. రైతుల ప్రయోజనాలను పక్కనపెట్టి ఇటు టీఆర్ఎస్, అటు బీజేపీ రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. వరి కొనుగోలుపై బీజేపీ మొండిగా వ్యవహరిస్తున్నా.. రాష్ట్ర మంత్రులు నాన్చుడు ధోరణితో వ్యవహరించటంపట్ల రైతాంగం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది. పంట కొనుగోలుపై ఎటూ తేలకపోవటంతో రైతుల ఊపిరి ఆగిపోతున్నది. రైతుల ప్రాణాలను రక్షించే విషయంలో రెండు పార్టీలకు చిత్తశుద్ది లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలను మభ్యపెట్టేందుకు బీజేపీ, టీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఒప్పందాన్ని తొక్కి పెట్టి కేంద్రాన్ని బదనాం చేస్తారా? : కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
ధాన్యం సేకరణలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు. రైతులను గందరగోళ పరుస్తున్నారని చెప్పారు. మంగళవారంఢిల్లీలో ఆయన విలేకర్లతోమాట్లాడారు. వరి ధాన్యం విషయంలో సీఎం కేసీఆర్ కూడా అబద్ధాలు మాట్లాడటం సరైందికా దన్నారు. దేశంలో ఉప్పుడు బియ్యాన్ని చాలా తక్కువగా తింటున్నారనీ, రా రైస్ ఎంత ఇచ్చినా తీసుకుంటామని ఏడాది క్రితమే రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదిరిందని గుర్తు చేశారు. ఒప్పందం ప్రకారం ధాన్యాన్ని సేకరించి ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందన్నారు. ఇప్పుడేమో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై అసత్య ప్రచారాన్ని చేస్తున్నదన్నారు. ఈ ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ధాన్యాన్ని ఎందుకు తరలించడం లేదు : మంత్రి నిరంజన్‌రెడ్డి
తెలంగాణ రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. చేయాల్సిన ధాన్యం సేకరణ కూడా సరిగ్గా చేయడం లేదు. ఇంకా ధాన్యం ఇవ్వాలంటూ రాష్ట్రంపై నెపం మోపడం సరైందికాదన్నారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు.రాష్ట్రంలో 30 నుంచి 40వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సరఫరా చేసే అవకాశం ఉన్న కేంద్రం చేయడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో10లక్షల మెట్రిక్ టన్నుల మిల్లింగ్ ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తరలించడం లేదన్నారు. కేంద్రం సేకరించడం లేదు కాబట్టి వచ్చే యాసంగిలో తాము కొనబోమని తెలిపారు. వానాకలం సీజన్‌కు సంబంధించిన 60లక్షల మెట్రిక్‌టన్నుల వరిధాన్యంకొనుగోళ్ల లక్ష్యం బుధవారానికి పూర్తవుతుందని చెప్పారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించిందని గుర్తు చేశారు. 10 నుంచి 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉందని చెప్పారు. మరో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కోతల దిశలోఉందని తెలిపారు. కేంద్రం కొనుగోలు చేయాలంటే అది రాత పూర్వకంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాజకీయ ప్రయోజనాల కోసమే... : టి సాగర్,
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రైతు సంఘం
బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతు న్నాయి. రైతుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయడం లేదు. సమస్యలను పక్కదారి పట్టించేందుకు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ప్రయత్నిస్తున్నారు. ఇది సరైందికాదు. ధాన్యాన్ని కొనడం, పంపిణీ చేయడం కేంద్రానిదే బాధ్యత. ఎక్కువగా పండిన రాష్ట్రాల నుంచి సేకరించి, కొరత ఉన్న రాష్ట్రాలకు పంపిణీ చేయాలి. లేదంటే ఇతర దేశాలకు దిగుమతి చేసైనా రైతులను ఆదుకోవాలి. యాసంగి ధాన్యాన్ని కొనబోమని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం...35 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వడానికి సిద్ధమైంది. పంటల మార్పిడి చేయాలని చెబుతున్నప్పటికీ అందుకనుగుణంగా రైతులను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవడం లేదు.