Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లోపాలను సవరించాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్
- విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేనతో సమావేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రధానోపాధ్యాయుల సీనియార్టీ జాబితాల్లో తప్పులున్నాయని ఉపాధ్యాయ సంఘాలు విమర్శించాయి. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులను మల్టీజోనల్ క్యాడర్ కేటాయింపులో భాగంగా రూపొందించిన సీనియార్టీ జాబితాల్లోని లోపాలను సవరించి సమగ్రంగా రూపొందించాలని డిమాండ్ చేశాయి. విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఆదేశాల మేరకు మంగళవారం పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సీనియార్టీ జాబితాలపై అభ్యంతరాలుంటే తెలపాలని ఆమె కోరారు. రాత్రి 12 గంటలకు జాబితాలు పంపి ఉదయమే అభ్యంతరాలు చెప్పమనటం సమంజసం కాదని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి తెలిపారు. సీనియార్టీ జాబితాలు విధుల్లో చేరిన తేదీ ఆధారంగా చేయటం సరైంది కాదని వివరించారు. స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసు నిబంధనలు 33,34,35,36 ప్రకారం చేయాలని సూచించారు. వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటామని శ్రీదేవసేన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూటీఎస్ అధ్యక్షులు జి సదానందంగౌడ్, ప్రధాన కార్యదర్శి ఎం పర్వత్‌రెడ్డి, టీపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాసులు, డీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి టి లింగారెడ్డి, పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షుడు ఎం చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి ఎం అంజిరెడ్డి,నాయకులు సత్యనారాయణ, ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి బ్రహ్మచారి పాల్గొన్నారు.
డీఎస్సీ మెరిట్ లిస్టు ప్రకారం సీనియార్టీ జాబితా రూపొందించాలి : టీఎస్‌జీహెచ్‌ఎంఏ
ప్రధానోపాధ్యాయులు విధుల్లో చేరిన ప్రకారం సీనియార్టీ జాబితా తయారు చేయడం సరైంది కాదని టీఎస్‌జీహెచ్‌ఎంఏ అధ్యక్షులు పి రాజభాను చంద్రప్రకాశ్, ప్రధాన కార్యదర్శి ఆర్ రాజగంగారెడ్డి, కోశాధికారి బి తుకారాం తెలిపారు. డీఎస్సీల వారీగా మెరిట్ లిస్టు ప్రకారం సీనియార్టీ జాబితాను రూపొందించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన, అదనపు సంచాలకులు లింగయ్యకు వినతిపత్రం సమర్పించారు. ప్రధానోపాధ్యాయులు ఆప్షన్లు ఇచ్చిన దానికి విరుద్ధంగా అవి నమోదు చేయబడ్డాయనీ, వాటిని సరిచేయాలని కోరారు. మల్టీ జోన్ల వారీగా క్యాడర్ స్ట్రెంత్ వివరాలను స్పష్టంగా ప్రకటించాలని సూచించారు. అడక్వసీతో సంబంధం లేకుండా ఎస్సీ,ఎస్టీ కేటగిరీ ప్రధానోపాధ్యాయులను మెరిట్ ప్రకారం కోరుకున్న మల్టీ జోన్లోనే కేటాయించాలని తెలిపారు. సవరించిన తర్వాతే కేటాయింపులు చేయాలని కోరారు.