Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
విద్యుత్రంగం 2021లో చీకటి వెలుగుల కలయికగా మిగిలింది. అక్కడక్కడ స్వల్ప అవాంతరాలు మినహా వినియోగదారులందరికీ 24 గంటల కరెంటును సరఫరా చేసింది. విద్యుత్ ప్రమాదాల కారణంగా సంభవించిన ప్రాణ నష్టం మాత్రం తగ్గలేదు. మనుషులతో పాటు మూగజీవాలు కూడా తెగిపడిన విద్యుత్ వైర్లతో షాక్కు గురై అశువులు బాసాయి.
పెరిగిన నష్టాలు
విద్యుత్ పంపిణీ సంస్థల నష్టాలు కొండెక్కి కూర్చున్నాయి. కరెంటు చార్జీలను పెంచినా, పూడ్చుకోలేనంత ఆర్థిక భారం డిస్కంలపై పడింది. మూడేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఏడాదే డిస్కంలు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ)కి 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాల వార్షిక ఆదాయ అవసరాల ప్రతిపాదనలు (ఏఆర్ఆర్) సమర్పించాయి. 2021-22లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.5,652 కోట్ల సబ్సిడీ సొమ్ము పోనూ, డిస్కంల ఆదాయ లోటు రూ.10,624 కోట్లు ఉన్నట్టు లెక్కల్లో చూపారు. అంతకుముందు రెండేండ్ల ఏఆర్ఆర్లు ఇవ్వలేదు.
విద్యుత్ సవరణ బిల్లు-2021
విద్యుత్ సవరణ బిల్లు-2021ని పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్రప్రభుత్వం శతవిధాల ప్రయత్నం చేసింది. దాన్ని అడ్డుకోవడంలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు, మేధావులు ఐక్యంగా విజయం సాధించారు.
రాష్ట్రప్రభుత్వం అండ
విద్యుత్ సవరణ బిల్లు-2021ని వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాసారు. ఈ బిల్లును రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేశారు.
మీటర్లు పెట్టం...
వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కొనసాగుతుందనీ, కేంద్రం ఆదేశించినట్టు పంపుసెట్ల వద్ద మీటర్లు పెట్టబోమనీ, షరతులకు లోబడి కేంద్రం ఇచ్చే రుణాలు కూడా అవసరం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
ఆదిత్య ముప్పు
విద్యుత్ సంస్కరణల్లో భాగంగా కేంద్రప్రభుత్వం గతంలో అమల్లోకి తెచ్చిన 'ఉదరు' స్కీం కాలపరిమితి ముగిసింది. ఆ స్థానంలో మరికొన్ని షరతుల్ని చేరుస్తూ కేంద్రం 'ఆదిత్య' స్కీంను ప్రవేశపెట్టింది. డిస్కంల అప్పుల్ని సాకుగా చూపి, వాటిని సంస్కరిస్తున్నట్టు ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తూ, క్రమేణా ప్రయివేటీకరణ వైపు అడుగులు వేయించడమే ఈ స్కీం లక్ష్యం. రెండేండ్లలోనే రాష్ట్రంలోని రెండు డిస్కంలు దాదాపు రూ.21వేల కోట్లకు పైగా నష్టాలు, అప్పుల్లో ఉండటంతో సర్కారు చూపు 'ఆదిత్య' వైపు మళ్ళుతున్నట్టు తెలుస్తోంది. ఈ స్కీంలో చేరతారా లేక ముఖ్యమంత్రి మాటల పైనే కట్టుబడి నిలుస్తారా అనేది వేచిచూడాలి.
శ్రీశైలం వివాదం
జలాశయంలోకి వరద నీరు చేరడంతో శ్రీశైలం జలవిద్యుత్కేంద్రంలో ఉత్పత్తి పెరిగింది. అయితే దీనిపై పొరుగురాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక ఫిర్యాదులు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు వెళ్లాయి. జలవిద్యుదుత్పత్తి వల్ల తాగునీటికి ఇబ్బందులు వస్తున్నాయంటూ ఆ రాష్ట్రం ఆక్షేపించింది. దీనితో జలాశయంలో నీళ్లు ఉన్నా, దశలవారీగా విద్యుదుత్పత్తిని నిలుపుదల చేయాల్సి వచ్చింది.
చార్జీలపెంపు కసరత్తు
ఐదేండ్లుగా రాష్ట్రంలో కరెంటు చార్జీలు పెంచలేదనీ, ఇప్పుడు పెంచక తప్పదని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. అయితే ఏ మేరకు పెంచుతారనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు.
'త్వరలో' అంటే...
'త్వరలో' అనే పదానికి తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) కొత్త భాష్యం చెప్పింది. డిస్కంలు ఏఆర్ఆర్లు ఇచ్చి, చార్జీల పెంపునకు సంబంధించిన టారిఫ్ ప్రతిపాదనలు ఇవ్వలేదు. 'త్వరలో' ఇమ్మన్నామని కోరినట్టు టీఎస్ఈఆర్సీ చైర్మెన్ ప్రకటించారు. నెల గడుస్తున్నా 'త్వరలో' అనే పదానికి నిర్వచనం లేకపోవడం గమనార్హం.
'సుమోటో'గా...
టారిఫ్ ప్రతిపాదనలు ఇవ్వనందున రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా టీఎస్ఈఆర్సీ డిస్కంలకు షోకాజ్ నోటీస్ ఇచ్చింది. తామిచ్చిన గడువులోపు ఎందుకు ప్రతిపాదనలు ఇవ్వలేదో చెప్పాలంటూ డిస్కంల సీఎమ్డీలను విచారణకు హాజరవ్వాలని నోటీసు ఇచ్చింది. కాకపోతే ఆ విచారణలో మళ్లీ సీఎమ్డీలు పదిరోజులు గడువు అడిగారు... వారం రోజుల్లో ఇచ్చేయండి అని ఈఆర్సీ ఉదారతను చాటుకుంది.