Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా భావిస్తున్న మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులు ఇంకా కొనసాగుతున్నాయి. అప్పులతిప్పలు తప్పడం లేదు. ప్రధాన పనులు పూర్తయినా, ప్రజలకు నీళ్లందించడంలో కీలకమైన ఇంట్రా విలేజ్ నెట్వర్క్ పనులు ఇంకా తఆలస్యమవుతున్నాయి. 2018 డిసెంబరు వరకు ఈ ప్రాజెక్టును పూర్తిచేస్తామన్న సర్కారు, 2021, డిసెంబరు నాటికీ తన లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. మొత్తం రూ. 46 వేలకోట్లకుగాను ఇప్పటివరకు రూ. 36 వేల కోట్లు ఖర్చుపెట్టింది. అన్ని జిల్లాల్లో ఇంట్రా పనులు కొనసాగుతున్నాయి.
స్వరూపం
రాష్ట్రంలోని 32 జిల్లాల్లోని 26 సెగ్మెంట్లల్లో 25 వేల ప్రాంతాలకు సురక్షిత తాగునీటిని అందించాలనే లక్ష్యంగా మిషన్‌భగీరథకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2048 సంవత్సరం నాటి ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని రూపొందించారు. ఇందుకోసం 1.30 లక్షల కిలోమీటర్ల పైపులైన్‌ను నిర్మించారు. గోదావరి నది నుంచి 53.68 టీఎంసీలు, కృష్ణానది 32.43 టీఎంసీలే నీటి వనరులుగా ఈ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. ఇందులో నాలుగు శాతం పరిశ్రమలకు కేటాయించాలనే విధానం తీసుకొచ్చింది. దీని అమలుతో పల్లెల్లో గత వేసవిలో నీటిఎద్దడి పెద్దగా తలెత్తలేదని అధికారులు చెప్పారు. ఇంట్రానెట్వర్క్ పనులు ఇంకా పూర్తికాకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో నల్లాలు బిగించలేదు.
అన్నీ అప్పులే
భగీరథ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆయా బ్యాంకుల సమూహంతో కూడిన ఆంధ్రా బ్యాంకు కన్సార్షీయం నుంచి అప్పుగా తీసుకున్నది. ఖర్చయిన రూ.36 వేల కోట్ల అప్పుకుగాను ఆయా బ్యాంకులకు నెలకు రూ. వెయ్యి కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తున్నది.
ఇంట్రా...ఇంకా పెండింగే
జనం ఇండ్లల్లోకి నీటిని తీసుకెళ్లే ఇంట్రా విలేజ్ నెట్వర్క్ పనులు ఇంకా సాగుతున్నాయి. కొందరు స్థానిక కాంట్రాక్టర్లు బిల్లులు రాక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వర్కింగ్ ఏజెన్సీలకు చెల్లించాల్సిన బకాయిలు సైతం రూ. 2 వేల కోట్లు ఉండటం తెలిసిందే.
పగులుతున్న పైపులు..చావులు
రాష్ట్ర వ్యాప్తంగా మెయిన్ పైపులైనింగ్తోపాటు గ్రామాల్లో చేపట్టిన ఇంట్రా పనుల్లోనూ లీకుల మీద లీకులు వచ్చాయి. వరంగల్, నాగర్‌కర్నూల్, చేవెళ్ల, మహబూబ్‌నగర్, వనపర్తి, మహబూబాబాద్, నల్లగొండ, కరీంనగర్, పెద్దపల్లి తదితర ప్రాంతాల్లో పైపులైన్లు లీకయ్యాయి. అలాగే ఆయా చోట్లా పనులు జరుగుతున్న క్రమంలో ప్రమాదాల కారణంగా దాదాపు 30 మందికిపైగా కార్మికులు చనిపోయారు.
కనీసవేతనాలు హుళక్కే
భగీరథ పనుల్లో పనిచేస్తున్న స్థానిక, స్థానికేతర కార్మికులకు కనీస వేతనాలు అమలుకాలేదు. కేవలం ఖమ్మం జిల్లాలో మాత్రమే జీవో నెంబరు 11 ప్రకారం ఇచ్చారు. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కార్మికులకు బకాయిలు చెల్లించక గత సంవత్సరంతోపాటు ఈ ఏడాది కూడా ధర్నాలు, ఆందోళనలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దాదాపు 15 వేల మంత్రి కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారు. మూడు నుంచి ఏడు నెలల దాకా వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి కోట్లల్లోనే ఉన్నాయి. ఒక్కో జిల్లాలో ఒక్కోలా వేతనాల పరిస్థితి ఉంది. మెఘా, రాఘవ, ఎల్అండ్టీ, ఎస్సీసీ, హెచ్‌పీ తదితర కంపెనీలు భగరథ ప్రధాన పనులు చేశాయి. ఇదిలావుండగా భగీరథ ప్రాజెక్టులోని చిన్న చిన్న లోపాలను గుర్తించి సవరించేందుకు డిసెంబరు నుంచి వచ్చే సంవత్సరం మార్చిదాకా క్రాష్ ప్రోగ్రామ్ అమలుకు శ్రీకారం చుట్టింది.