Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉద్యోగుల సర్దుబాట్లలో ఏజెన్సీ చట్టాల ఉల్లంఘణ జరుగకుండా చూడాలని తెలంగాణ గిరిజన సంఘం(టీజెఎస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మానాయక్, ఆర్ శ్రీరాం నాయక్ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. జోనల్, మల్టీ జోనల్ అధికరణ 371(డి) కు లోబడి తెచ్చిన ఉద్యోగ, ఉపాధ్యాయుల సర్దుబాటు జీవో 317 అమలు విషయంలో ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంత గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కులను కాలరాస్తున్నదని తెలిపారు. సీఎం ఈ విషయమై తక్షణం జ్యోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు. భారత రాజ్యాంగం అధికరణలు 244 ,244 (ఎ ) ప్రకారం షెడ్యూల్ ప్రాంతంలో గిరిజనుల హక్కులను కాపాడటం కోసం ప్రత్యేక చట్టాలను, జీవోలు అమల్లో ఉన్నాయని గుర్తుచేశారు. వీటికి లోబడే ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగ, ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాల్సిన ప్రభుత్వం జీవో 317ను చూపి ఇష్టానుసారంగా వ్యవహరించటం సరికాదని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో అమల్లో ఉన్న చట్టాలు, జీవోలను ఉల్లంఘించి అక్కడ వారిని మైదాన ప్రాంతానికి ,మైదాన ప్రాంతం వారిని ఏజెన్సీ ప్రాంతానికి సర్దుబాట్లు చేయడం అన్యాయమని పేర్కొన్నారు. ఐదో షెడ్యూల్ ప్రాంతాల్లో అన్ని శాఖల ఉద్యోగ నియామకాలతో పాటు పదోన్నతుల్లో సైతం స్థానికత ఆధారంగానే ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు.