Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిహారం అందించకుండా సింగరేణి భూముల్లోకి చొరబడటం చట్ట విరుద్ధం
- నిర్వాసిత రైతులకు అండగా ఉంటాం: సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
- కొమ్మేపల్లి భూనిర్వాసితుల దీక్షకు సంఘీభావం
నవతెలంగాణ- సత్తుపల్లి
సింగరేణిలో భూములు కోల్పోతున్న నిర్వాసిత రైతులకు ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం పరిహారం అందించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పరిహారం అందించకుండా భూముల్లోకి చొరబడి సింగరేణి పనులు ప్రారంభించడాన్ని నిరసిస్తూ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కొమ్మేపల్లిలో నిర్వాసిత రైతులు చేపట్టిన దీక్షా శిబిరాన్ని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు బుధవారం సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నాగేశ్వరరావు మాట్లాడుతూ.. నిర్వాసిత రైతులకు పరిహారం అందించకుండా భూములను సింగరేణి సంస్థ స్వాధీనం చేసుకొని పనులు ప్రారంభించడం చట్ట విరుద్ధమన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రస్తుత మార్కెట్ ధరను అనుసరించి ఎకరానికి రూ.25లక్షలకు పైగా పరిహారం అందించాలని సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. నిర్వాసిత రైతులకు న్యాయం జరిగేంతవరకు సీపీఐ(ఎం) రైతుల పక్షాన అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సింగరేణిలో భూములు కోల్పోయిన ఇతర గ్రామాల రైతులకు ఇచ్చిన మాదిరిగానే కొమ్మేపల్లి రైతులకు అందించాలన్నారు. వీవీ పాలెంలో ఖమ్మం కలెక్టరేట్ భవనాల నిర్మాణాలకు సేకరించిన భూములకు అప్పటి కలెక్టర్ తనకున్న విస్తృత అధికారాన్ని ఉపయోగించి ఎకరానికి రూ. కోటి వరకు చెల్లించిన ఉదంతాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అదే విధంగా ఈ భూములకు పరిహారం అందించడంలో ప్రభుత్వం ఎందుకు వివక్ష చూపుతోందని విమర్శించారు. కొమ్మేపల్లి భూముల విషయంలో రెవెన్యూ అధికారులు కొన్ని సాంకేతిక అవాంతరాలను సృష్టించి సింగరేణికి అనుకూలంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమన్నారు. రైతులకు పరిహారం అందించకుండా భూములను స్వాధీనాన్ని వెంటనే నిలుపుదల చేయాలన్నారు. లేనియెడల సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీపీఐ(ఎం) సత్తుపల్లి మండల కార్యదర్శి జాజిరి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రైతుసంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు, జిల్లా సహాయ కార్యదర్శి తాతా భాస్కరరావు, వేంసూరు మండల కార్యదర్శి అర్వపల్లి జగన్మోహనరావు, నిర్వాసితుల సంఘ నాయకులు వెల్ది ప్రసాద్, పెద్దిరెడ్డి పురషోత్తం, మోరంపూడి సుబ్బారావు, నరుకుళ్ల కృష్ణయ్య, ఉడతనేని చంద్రరావు, నరుకుళ్ల లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.