Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భూసేకరణ చట్టానికి భిన్నంగా జీవో 123 జారీ చేసిన కేసులో రెవెన్యూ ముఖ్య కార్యదర్శికి (ప్రస్తుతం ఈ పదవిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహిస్తున్నారు) హైకోర్టు రూ.10 వేలు జరిమానా విధించింది. ఆ కేసులో నాలుగేండ్లుగా కౌంటర్ వేయకపోవటంతో ఈ జరిమానాను విధించింది. ఈ మొత్తాన్ని పీఎం కరోనా రిలీఫ్ ఫండ్‌కు జమ చేయాలంటూ ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయకపోతే వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలన్న ఉత్తర్వులను అమలు చేయకపోటంతో వచ్చే ఏడాది జనవరి 24న జరిగే విచారణకు స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని సమన్లు జారీ చేసింది. విచారణకు రాలేనప్పుడు అనుమతి కోరుతూ అఫిడవిట్ కూడా దాఖలు చేయలేదని తప్పుపట్టింది. జీవో 123ను సవాల్ చేసిన రిట్లను బుధవారం చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్రశర్మ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారించింది. కౌంటర్ వేసేందుకు కొంత సమయం కావాలనీ, దాన్ని సిద్ధం చేశామని ప్రభుత్వం చెప్పింది. పిటిషనర్ తరుపు న్యాయవాది స్పందించి, ఇదే తరహాలో వాయిదాలు కోరుతూ ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందని, కౌంటర్ వేయకపోతే రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి స్వయంగా విచారణకు రావాలన్న గత ఆదేశాలను కూడా అమలు చేయలేదని వివరించారు. దీంతో హైకోర్టు తీవ్ర స్థాయిలో ప్రభుత్వ అధికారిపై ఆగ్రహాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేసింది. విచారణను జనవరి 24కి వాయిదా వేసింది. ఈలోగా కౌంటర్ వేయాలని, అదే రోజు విచారణకు రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి స్వయంగా హాజరుకావాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.