Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీయూష్ గోయల్‌కు వ్యాపార ప్రయోజనాలే ముఖ్యం
- ఢిల్లీలో మీడియాతో మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రైతులంటే బీజేపికి గిట్టదని రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. వారిని ఆ పార్టీ శత్రువులుగా చూస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన బుధవారం అక్కడ మాట్లాడుతూ... బీజేపీకి రాజకీయ ప్రయోజనాలు తప్ప రైతుల ప్రయోజనాలు పట్టటం లేదన్నారు. ధాన్యం సేకరణకు సంబంధించిన రాత పూర్వక హామీ కోసం తాము ఢిల్లీకి వస్తే... ఆ హామీ ఇవ్వకుండా కేంద్ర మంత్రులు చోద్యం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశానికి సంబంధించి ఏ రాష్ట్రంలోనూ లేని సమస్య ఒక్క తెలంగాణలోనే ఎందుకు వచ్చిందో చెప్పాలంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతగా వరి పంట పండిందనీ, అందువల్ల ధాన్యాన్ని అదనంగా కొనుగోలు చేయాలంటూ తాము కోరుతున్నామని తెలిపారు. కేంద్రంతో 40 లక్షల టన్నుల బియ్యానికి అగ్రిమెంట్ జరిగిందని అన్నారు. ఆ టార్గెట్ పూర్తయినా... ఇంకా మార్కెట్ యార్డులు, కల్లాల్లో ధాన్యపు రాశులున్నాయని చెప్పారు. కొన్ని చోట్ల ఇంకా కోతలు కూడా పూర్తి కాలేదని గుర్తు చేశారు. ఈ క్రమంలో బీజేపీ రాజకీయాలు చేయటం సరికాదన్నారు. కేసీఆర్‌తో రైతులను విడదీయటం సాధ్యం కాదని హెచ్చరించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా కమలం పార్టీకి తోక పార్టీగా మారిందని మంత్రి ఈ సందర్భంగా విమర్శించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఒక వ్యాపారి, అలాంటి సంస్థలకు ప్రతినిధి, అందువల్ల ఆయనకు రైతులు, దేశ ప్రయోజనాలకన్నా వ్యాపార ప్రయోజనాలే ముఖ్యమని ఎద్దేవా చేశారు.