Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకుల అరెస్ట్
- నూతన విద్యావిధానం.. రాజ్యాంగ లక్ష్యాలకు విరుద్దం
- సెమినార్ రద్దు చేయాలని డిమాండ్
నవతెలంగాణ-ఓయూ
కేంద్రం ముందుకు తెచ్చిన నూతన జాతీయ విద్యా విధానం భారత రాజ్యాంగ లక్ష్యాలకు వ్యతిరేకమైనదని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎల్ మూర్తి అన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలు, ఆర్ఎస్ఎస్ అనుబంధ టీచర్ యూనియన్ (ఏబీఆర్ఎస్ఎం)తో కలిసి సెమినార్ నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ ఇతర విద్యార్థి సంఘాలన్నీ నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో సెమినార్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, ఏఐఎస్ఎఫ్ ఓయూ కార్యదర్శి క్రాంతి రాజ్, నాయకులు రెహమాన్, కరణ్, అరవింద్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేసి, ఓయూ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేద విద్యార్థులను చదువులకు దూరం చేసేలా మనుషుల మధ్య అనైక్యతను సృష్టించే హిందూత్వ భావజాలంతో, కుట్రపూరిత ఆలోచనతో నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించారని తెలిపారు. దీనిపై కనీసం పార్లమెంట్లో చర్చ జరపకుండా ఏకపక్షంగా తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని దేశ వ్యాప్తంగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, మేధావులు వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. విద్య కాషాయీకరణ, మనువాద భావజాలం విద్యలో ప్రవేశపెట్టాలనే కుట్ర ఇందులో ఉందన్నారు. ఈ విద్యా విధానం భారత రాజ్యాంగ లక్ష్యాలకు వ్యతిరేకమైనదని తెలిపారు. నూతన విద్యా విధానాన్ని వెనక్కి తీసుకోవాలని, ఓయూలో సెమినార్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.