Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్ఈపీ ద్వారా భారత్ విశ్వగురువు అవుతుంది: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
- నూతన జాతీయ విద్యావిధానంపై సెమినార్ ప్రారంభం
నవతెలంగాణ-ఓయూ
విద్యార్థినులు సవాళ్లను ఎదర్కొనే కోర్సులు ఎంచుకుని ఉన్నతగా ఎదగాలని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ అన్నారు. నూతన జాతీయ విద్యావిధానం ద్వారా భారత్ రానున్న రోజుల్లో విశ్వగురువుగా అవతరిస్తుందన్నారు. బుధవారం హైదారబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఓయూ, ఏబీఆర్ఎస్ఎంల ఆధ్వర్యంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి, ఐసీఎఫ్ఏఐ, సీఈఎస్ఎస్ వారి సహకారంతో 'సినర్టయిజింగ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ద కాంటెక్ట్స్ ఆఫ్ ఎస్ఈపీ- 2020, స్ట్రాటజిస్ ఫర్ ఇంప్లిమెంటేషన్' అనే అంశంపై రెండు రోజుల పాటు జరగనున్న జాతీయ సెమినార్ ప్రారంభ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జాతీయ విద్యావిధానంపై గ్రామస్థాయి నుంచి చర్చ జరగాలన్నారు. 2015 నుంచి ఈ విధాన రూపకల్పన ద్వారా ఎన్ఈపీ ఒక సంపూర్ణ నివేదిక తయారు చేసిందని తెలిపారు. అయితే జాతీయ విద్యా విధానంలోని వివిధ అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు వారి వారి అవసరాలకు అనుగుణంగా విద్యా విధానంలో తగిన మార్పులు, చేర్పులు చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని వీసీలకు గవర్నర్ సూచించారు. మెరుగైన విద్యా విధానాన్ని అమలు చేయాల్సిన బాధ్యత వర్సిటీలపై ఉంటుందన్నారు. విద్యారంగంలో బాలికల సంఖ్య పెరుగుతోందని చెప్పారు. ఆడపిల్లల పెండ్లి వయసు 21 ఏండ్లకు పెంచడం హర్షణీయమన్నారు. ఏటా దేశం నుంచి 10 లక్షల మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకుంటున్నారని చెప్పారు. వివిధ దేశాల నుంచి ఇక్కడికి 50 వేల మంది ఉన్నత చదువుల కోసం వస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ.. అత్యంత ఖరీదైన కోర్సులను ఇక్కడి పేద విద్యార్థులు కూడా చదువుకునేందుకు అందుబాటులోకి తెచ్చామన్నారు. జాతీయ విద్యావిధానం సమానత్వమిస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రొ. ఎన్. కిషన్, ఏబీఆర్ఎస్ఎం అధ్యక్షులు ప్రొ. జగదీశ్ ప్రసాద్ సింఘాల్, వీసీలు ప్రొ. భట్టు సత్యనారాయణ, ఓయూ వీసీ ప్రొ.రవీందర్, ఏఐసీటీఈ చైర్మెన్ ప్రొ.అనిల్ సహస్ర భూదే, సెమినార్ నిర్వాహకులు గుంత లక్ష్మణ్, డా.యాదయ్య, ప్రొ.మనోహర్, డా.వివేక్, డా.శంకర్, డా.రామకృష్ణ, ప్రొ.సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.