Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడి నుంచి ఇంటికి పోయాకే భోజనం
- మాడ్గుల మండలంలో నిలిచిన మధ్యాహ్న భోజనం
- కడుపు మాడ్చుకొని క్లాసులు వింటున్న విద్యార్థులు
- బస్సు సౌకర్యం లేక 3 కి.మీ నడక
- అర్థకాలితో చదువుపై దృష్టి కోల్పోతున్న విద్యార్థులు
- బిల్లులు చెల్లించకపోవడంతో వంట ఆపేశాం : మధ్యాహ్న భోజన కార్మికులు
- భోజనం అందించాలని విద్యార్థులు ఆవేదన
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
''ఆ బడిలో మధ్యాహ్న భోజనం వండటం లేదు. విద్యార్థులు బువ్వలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నుంచి సద్ది తీసుకుపోదామన్న అంత పొద్దుగాల బువ్వ వండే పరిస్థితి లేదు. కడుపు మాడ్చుకుని బడిలో పాఠాలు వింటున్నాం. ఆకలితో ఉన్న మాకు... సార్లు చెప్పేదేమీ అర్థం కావడం లేదు. పొద్దున ఇంటి దగ్గర చారులో తిన్న బిస్కెట్లు తప్ప.. సాయంత్రం ఇంటికి పోయేదాక ఏమీ తినేది లేదు. కడుపు మాడ్చుకుని పాఠాలు వినలేక ఎక్కువ మంది బడి మానేశారు. పరిస్థితి ఇట్లే ఉంటే మేము కూడా చదువుకు దూరమైయ్యేటట్టు ఉన్నాం'' అని రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం అందుగుల, నల్లచెర్వు, ఆర్కపల్లి , రామదుగ్యాల ప్రభుత్వం పాఠశాలలకు చెందిన విద్యార్థులు 'నవతెలంగాణ'తో తమ గోడు వినిపించారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2,267 ప్రభుత్వ పాఠశాలల్లో 2,20,356 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. మాడ్గుల మండలంలోని అందుగుల హైస్కుల్, నల్లచెర్వు, ఆర్కపల్లి ప్రైమరి స్కూల్, రామదుగ్యాల ప్రభుత్వ పాఠశాలల్లో అక్టోబర్ నుంచి మధ్యాహ్న భోజనం పెట్టకపోవడంతో విద్యార్థులు పస్తులుంటున్న పరిస్థితి నెలకొంది. విద్యార్థులు బువ్వ కోసం ఇబ్బందులు పడుతుండటంతో ఇంటి నుంచి భోజనం తెచ్చుకోవాలని ఉపాధ్యాయులు చెబుతున్నారు. కానీ ఆయా పాఠశాలలకు.. తాండాలు, గూడెంల నుంచే ఎక్కువమంది విద్యార్థులు స్కూల్కు వస్తుంటారు. వీరంతా రెండు, మూడు కిలో మీటర్లు కాలి నడకన రావాల్సి ఉంది. ఆర్కపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రైమరీ, హైస్కుల్ పరిధిలో పలుగుతాండ, సుద్దతాండ, మఖ్తతాండ, బావోజీ తాండల నుంచి సుమారు 40 మంది విద్యార్థులు 3 కి.మీ దూరంలో ఉన్న ఆర్కపల్లి ప్రభుత్వ పాఠశాలకు వెళ్తుంటారు. ఈ ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం లేక.. ఇతర వాహనాలు కూడా తిరగడానికి రోడ్డు మార్గాలు సరిగ్గా లేకపోవడంతో విద్యార్థులు కాలినడకన వెళ్లాలి. పుస్తకాల బ్యాగ్ మోసుకొచ్చుడే కష్టతరమైన పని దానికి తోడు సద్ది తెచ్చుకోవడం మరింత ఇబ్బందిగా మారిందని విద్యార్థులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెండింగ్ బిల్లులతో నిలిచిన మధ్యాహ్న భోజనం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా భోజన తయారీకి 1వ తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థులకు కేంద్రం 75 శాతం, రాష్ట్ర 25 శాతం చెల్లిస్తున్నాయి. అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 9, 10వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టేందుకు ప్రతి విద్యార్థికి రూ. 9.40పైసలు చెల్లిస్తోంది. ఈ లెక్కన ప్రతి నెలా క్రమం తప్పక బిల్లులు చెల్లించాల్సినప్పటికీ గతేడాది మార్చి నుంచి ఇప్పటివరకు బిల్లులు చెల్లించకపోవడంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సుమారు రూ. 60లక్షల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 9,10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా మధ్యాహ్న భోజనం పెడుతున్నప్పటికీ బిల్లులు చెల్లించడం లేదని కార్మికులు వాపోతున్నారు. ఇప్పటికే భోజన తయారీ కోసం చేసిన అప్పులకు వడ్డీలు పెరుగుతుండటంతో మళ్లీ కొత్త అప్పులు చేయలేక జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్న భోజన కార్మికులు పాఠశాలల్లో భోజనం వండటం మానేసినట్టు తెలిపారు. మధ్యాహ్న సమయంలో భోజనం పెట్టకపోవడంతో కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి బాక్సులు ఇచ్చి వెళ్తున్నారు. మరికొందరు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కార్మికులకు మిగిలిన బకాయిలు చెల్లించి, మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని విద్యార్థులు, ఆయా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
బిల్లు ఇవ్వలేదని వంట మనుషులు రావడం లేదు
మాకు రోజూ అన్నం వండిపెట్టే వాళ్లకు బిల్లులు ఇవ్వడం లేదని నెల రోజుల నుంచి మధ్యాహ్నం భోజనం వండటం లేదు. వారికి జీతం పెంచి, బిల్లులు ఇచ్చేదాక వారు రారంట.. వారు మధ్యాహ్నం భోజనం వండకపోతే మాకు తిప్పలవుతుంది. ప్రభుత్వం తొందరగా బిల్లులు చెల్లించి.. మాకు అన్నం వండిపెట్టేలా చూడాలి.
- సరి, ఐదోవ తరగతి, విద్యార్థిని
మధ్యాహ్నం బువ్వ పెడుత లేరు
మా స్కూల్లో మధ్యాహ్నం బువ్వ బంద్ చేసిర్రు.. సారు ఇంటి నుంచి తెచ్చుకోమన్నడు. నెల రోజుల నుంచి ఇంటి నుంచి తెచ్చుకుంటున్నాం. మా ఇల్లు స్కూలుకు చాలా దూరంగా ఉంటుంది. పుస్తకాలు, సద్ది మోయలేకపోతున్న. ఒక్కొ క్క రోజు మా అమ్మ వచ్చి అన్నం ఇచ్చిపోతుంది. అమ్మ పనికి పోయిన రోజు.. నేను ఇంటికి వెళ్లి తిని వస్తున్న.
- విజ్ఞశ్, ఐదో తరగతి, నల్లచెర్వు, ప్రైమరీ స్కూల్
ప్రభుత్వం భరోసా కల్పించాలి
మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం అమలుచేయాలి. వంటశాల వద్ద రోజు వేడికి అనారోగ్యానికి గురవుతున్న కార్మికులకు రక్షణ లేకుండా పోతుంది. ప్రభుత్వం ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించి మా బతుకులకు భరోసా కల్పించాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే విధంగా ఉద్యమాలు చేపడుతాం.
- స్వప్న, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు