Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేస్కేలు కోసం వీఆర్ఏల ఐక్యపోరాటం
- వారసులకు ఉద్యోగాలివ్వాలి
- జీవోలను వెంటనే విడుదల చేయాలి : తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల జేఏసీ డిమాండ్
- ఈనెల 28,29,30 తేదీల్లో తహశీల్ కార్యాలయాల ఎదుట నిరసనలు
- జనవరి 10 కలెక్టరేట్ల ముట్టడి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీఎం ఇచ్చిన హామీ కోసం 15 నెలలు ఓపికతో ఎదురుచూశామనీ, ఇంకా ఎంత కాలం ఎదురు చూడాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్ఏ) ఐక్యకార్యాచరణ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పేస్కేలు, వారసత్వ ఉద్యోగాల జీవోల కోసం ఐక్యంగా పోరాడుతామని ప్రకటించింది. ఈ నెల 28,29,30 తేదీల్లో తహశీల్దార్ల కార్యాలయాల ఎదుట నిరసన దీక్షలు చేపట్టాలని నిర్ణయించింది. జనవరి పదో తేదీన కలెక్టరేట్లను ముట్టడికి పిలుపునిచ్చింది. మిగతా రెవెన్యూ సంఘాలు కూడా తమ పోరాటాలకు మద్దతు తెలిపి కలిసి రావాలని కోరింది. బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం, తెలంగాణ రిక్రూట్మెంట్ వీఆర్ఏల సంఘాల ఉమ్మడి సమావేశం జరిగింది. వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.బాలనర్సయ్య, వంగూరు రాములు మాట్లాడుతూ..స్వయంగా సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా పే-స్కేల్ అమలు చేస్తానని ఇచ్చిన హామీ నేటికీ పట్టాలెక్కలేదని విమర్శించారు. వెంటనే పేస్కేలు, వారసత్వ ఉద్యోగాల జీవోలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వీఆర్వో వ్యవస్థ రద్దు తర్వాత వీఆర్ఏలపై భారం విపరీతంగా పెరిగిందని వాపోయారు. వీఆర్ఏలకు ప్రమోషన్లు లేవన్నారు. వీఆర్వో వ్యవస్థ రద్దు చేశారు కానీ వారికి ఇంతవరకు ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలో ప్రభుత్వానికే స్పష్టత లేదని విమర్శించారు. వీఆర్ఏలకు పనిచేస్తున్న గ్రామంలోనే డబుల్‌బెడ్ రూమ్ ఇండ్ల హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇసుక మాఫియా చేతిలో వీఆర్ఏలు హత్యలకు గురవుతున్నారనీ, చాలీ చాలని జీతాలతో ఆర్థిక ఇబ్బందులతో కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.వెంకటేశ్, కందుకూరి బాపుదేవ్ మాట్లాడుతూ..వీఆర్ఏల చావులన్నీ ప్రభుత్వ హత్యలేనని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడి ఏడున్నరేండ్లు దాటినా సీసీఎల్‌ఏని నియమించకపోవడం దారుణమన్నారు. రెవెన్యూ శాఖలోని ఖాళీలను భర్తీచేసి వీఆర్ఏలకు ప్రమోషన్లు కల్పించాలని కోరారు. ప్రతినెలా 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. వీఆర్ఏలకు హామీలిచ్చి అమలు చేయకుండా రాష్ట్ర సర్కారు కాలయాపన చేస్తూ మోసం చేస్తున్నదని విమర్శించారు. రెవెన్యూ శాఖలో పేరుకుపోయిన పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఐక్యపోరాటాలే మార్గమని చెప్పారు. వీఆర్వో సంఘం నాయకులు ఈశ్వర్ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం వీఆర్వోలు, వీఆర్ఏలు ఐక్యం కాకుండా పకడ్బందీ ప్రణాళికాతో వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిందన్నారు. కొన్ని సంఘాల ప్రలోభాలకు గురికాకుండా వీఆర్ఏలంతా ఐక్యంగా ఒక్కతాటిపైకొచ్చి కొట్లాడితేనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుతాయని అభిప్రాయపడ్డారు. భయపడితే..భయపెడుతూనే ఉంటారనీ, అలా కాకుండా పోరాటాల ద్వారా విజయాలు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి జిల్లాల నుంచి వందలాది మందిమ వీఆర్ఏలు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘాల నాయకులు లక్ష్మి, ఎస్డీ అమీరుద్దీన్, రాజయ్య, జి.రాములు, శ్రీధర్, ఉమామహేశ్వర్రావు, దాదేమియా, మల్లయ్య, భోజన్న, క్రిష్ణయ్య, బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.
భవిష్యత్ కార్యాచరణ ఇదే..
- ఈ నెల 28,29,30 తేదీల్లో తహశీల్దార్ కార్యాలయాల ఎదుట నిరసన దీక్షలు
- జనవరి 10న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు
- జనవరి 15 నుంచి ప్రతిపక్ష నాయకులకు, మంత్రులకు, రెవెన్యూ శాఖ అధికారులకు వినతిపత్రాలు
- ఫిబ్రవరి 7 నుంచి 12 వరకు వారం రోజులు హైదరాబాద్‌లో దీక్షలు, ప్రతిరోజూ ఒక ఉమ్మడి జిల్లా నుంచి దీక్షలో పాల్గొనాలి.
- అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చలో హైదరాబాద్ కార్యక్రమం
- అప్పటికీ సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె