Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగని ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు
- నలుగురి బలవన్మరణం
- 2019లో 27 మంది మృతి
- ఇంటర్ బోర్డు తీరుపై సర్వత్రా ఆగ్రహం
- కనీస మార్కులతో పాస్ చేయాలని డిమాండ్
- స్పందించకుండా చోద్యం చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్రంలో ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాలపై గందరగోళం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఫెయిల్ కావడం, తక్కువ మార్కులు వచ్చాయన్న మనస్థాపంతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు నలుగురు విద్యార్థులు బలవన్మరణం చేసుకున్నారు. ఫెయిలయ్యామన్న మనస్థాపంతో నల్లగొండకు చెందిన జాహ్నవి రైలు కింద పడి, నిజామాబాద్‌కు చెందిన ధనుష్ ఉరేసుకుని, జయశంకర్ భూపాలపల్లికి చెందిన వరుణ్ ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా ఆదిలాబాద్‌కు చెందిన నందిని పురుగుల మందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె చనిపోయారు. ఇంటర్ ఫలితాలపై విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు.
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
2019లోనూ ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరగడంతో ఏకంగా 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. తక్కువ మార్కులొచ్చిన వారు, ఫెయిలైన విద్యార్థులు, బాగా రాయనివారు వచ్చేఏడాది ఏప్రిల్‌లో జరిగే పరీక్షలకు హాజరు కావాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి ప్రకటన ఇవ్వడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. బోర్డు తీరు మార్చుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యార్థుల ఆత్మహత్యలను ఆపాలనీ, ఫెయిలైన వారిని కనీస మార్కులతో పాస్ చేయాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు, అధ్యాపక సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయినా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే స్పందించాలనీ, తద్వారా విద్యార్థుల ఆత్మహత్యలను ఆపాలని కోరుతున్నారు.
ఫలితాలపై కరోనా ప్రభావం
ఈనెల 16న ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 4,59,242 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 2,24,012 (49 శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 2,35,230 (51 శాతం) మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. కరోనా నేపథ్యంలో 2021, మార్చిలో ఇంటర్ వార్షిక పరీక్షలు జరగలేదు. దీంతో ఇంటర్ సెకండియర్ విద్యార్థులందర్నీ ప్రభుత్వం పాస్ చేసింది. అప్పుడు ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులను ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులు అక్టోబర్‌లో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాశారు. సెకండియర్ పాఠ్యాంశాలను బోధిస్తున్న సమయంలో ఫస్టియర్ పరీక్షలు రాయడం విద్యార్థులను గందరగోళంలోకి నెట్టింది. ఇంకోవైపు ఈ ఫలితాలపై కరోనా ప్రభావం స్పష్టంగా కనిపించింది. గత విద్యాసంవత్సరంలో సెప్టెంబర్ ఒకటి నుంచి ఆన్లైన్ తరగతులకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటి నుంచి మార్చి 23 వరకు ప్రత్యక్ష బోధన సాగింది. కరోనా తీవ్రత నేపథ్యంలో మార్చి 24 నుంచి విద్యాసంస్థలను మూసివేస్తున్నట్టు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ప్రత్యక్ష బోధన పూర్తిస్థాయిలో లేకపోవడం, ఆన్లైన్ పాఠాలు అర్థంకాకపోవడం విద్యార్థులను అయో మయానికి గురిచేసింది. ఇంకోవైపు ప్రభుత్వ కాలేజీలు, గురుకులాలు, మారు మూలు ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో పాఠాలే వినలేని పరిస్థితి. అందుకే 51 శాతం మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. కనీస మార్కులతో పాస్ చేయడమే సరైన నిర్ణయమని విద్యావేత్తలు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఇంకోవైపు ఇంటర్ ప్రథమ సంవత్సరంలో వారిని పాస్ చేస్తేనే ద్వితీయ సంవత్సరం సబ్జెక్టులను చదువుతారని చెప్తున్నారు. ప్రభుత్వం కనీస మార్కులతో పాస్ చేస్తుందని విద్యార్థులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు.
అందరినీ పాస్ చేయాలి : ఆర్ఎల్ మూర్తి, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు
ఇంటర్లో ఫెయిలైన విద్యార్థులందరినీ కనీస మార్కులతో పాస్ చేయాలి. ఇప్పటికే నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మరొకరు బలవన్మరణానికి పాల్పడకముందే ప్రభుత్వం మేల్కోవాలి. కరోనా నేపథ్యంలో విద్యార్థులందరికీ న్యాయం చేయాలి. ఆలస్యం చేయడం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడడమే అవుతుంది.
విద్యార్థులకు న్యాయం చేయాలి : రామకృష్ణగౌడ్, టిగ్లా ప్రధాన కార్యదర్శి
ఇంటర్లో ఫెయిలైన విద్యార్థులకు ప్రభుత్వం న్యాయం చేయాలి. గత విద్యాసంవత్సరంలో ప్రత్యక్ష బోధన లేకపోవడం వల్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివిన విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. ఆన్లైన్ సౌకర్యం పూర్తిస్థాయిలో లేనందున పాఠాలు వినలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలి.