Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజకీయ నేతలా మాట్లాడుతున్నారు
- తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి : మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్ర మంత్రి పీియూష్ గోయల్ తెలంగాణ ప్రజలను కించపరిచేలా మాట్లా డుతున్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. ఆయన కేంద్ర మంత్రిలా కాకుండా ఒక రాజకీయ నేతలా వ్యవహరించారని చెప్పారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని వైద్యవిధాన పరిషత్‌లో హరీశ్‌రావు బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వ్యాఖ్యలను ఆయన ఖండించారు. 70లక్షల మంది రైతుల తరఫున రాష్ట్ర మంత్రులు ఢిిల్లీకి వెళ్లారని చెప్పారు. రాష్ట్ర మంత్రులను ఉద్దేశించి 'మీకేం పని లేదా' అంటూ అభ్యంతరకంగా మాట్లాడారనీ, ఇది తెలంగాణ ప్రజానీకాన్ని అవమానించటమేనని విమర్శించారు. 70లక్షల రైతు కుటుంబాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనన్నారు. పంజాబ్ మాదిరిగా తెలంగాణలోనూ పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. యాసంగి ధాన్యం కొంటారా? లేదా? అనే విషయాన్ని చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో రైతుబంధు కింద రూ14,500కోట్ల సాయం చేశామని గుర్తు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమనీ, దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమేనన్నారు. గతంలో కరువు వస్తే మెడ మీద కత్తి పెట్టి ధాన్యం సేకరించలేదా? కేంద్రానికి చేతకాకపోతే ధాన్యం ఎగుమతి, దిగుమతి అంశాన్ని రాష్ట్రాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వంపై అనవసరంగా బురదజల్లే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ బృందాన్ని అవమానించే హక్కు గోయల్‌కు లేదన్నారు. మూడు రోజుల పాటు మంత్రిని కలిసేందుకు ప్రయత్నిస్తే సమయం ఇవ్వలేదని విమర్శించారు. కానీ అదే మంత్రికి స్థానిక బీజేపీ నేతలను కలిసేందుకు సమయం ఉందా? అని ప్రశ్నించారు. దీనిపై రాష్ట్ర బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వారికి ఓట్లు కావాలి తప్ప రైతుల బాధలు పట్టటంలేదని విమర్శించారు. ఇది బీజేపీ కుటిలనీతికి నిదర్శనమన్నారు. కేంద్ర మంత్రి ఒక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమిపై మాట్లాడటమేంటనీ, ఉపఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ ఓడిపోలేదా? అని ప్రశ్నించారు. గోదాముల సామర్థ్యం పెంచాలంటూ పదిసార్లు లేఖలు రాసినా పట్టించుకోలేదని విమర్శించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా పార్లమెంట్ సాక్షిగా అబద్ధాలు మాట్లాడితే ఏం చేస్తామని ఆవేదన వ్యక్తం చేశారు.