Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు
- ఆజ్యం పోస్తున్న బీజేపీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర సాగునీటిరంగంలో ఈ ఏడాది మిశ్రమఫలితాలే వచ్చాయి. భారీప్రాజెక్టులు నిర్మించినా, ఉమ్మడిరాష్ట్రంలోని పాత పథకాలను మాత్రం సర్కారు పూర్తిచేయలేకపోయింది. కేంద్రంలోని బీజేపీ సర్కారు అపెక్స్ కౌన్సిల్ పేర ఆజ్యం పోస్తున్నది. అంతేకాదు పునర్విభజన చట్టాన్ని అమలుచేయకుండా తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టింది. కేంద్రం సమస్యలు పరిష్కరించకుండా కొర్రీలు పెడుతూ మరింత జాప్యం చేస్తున్నది. అంతర్రాష్ట్ర జలవివాదాలను ఇప్పుడు రెండు ట్రిబ్యునళ్లు పరిష్కరించలేకపోయాయి. మూడో ట్రిబ్యునల్ ఏర్పాటుకు డిమాండ్ ముందుకు వచ్చింది. ఇదిలావుండగా పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణానదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ), గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ)ను కేంద్రం ఏర్పాటు చేసింది. వీటి నిర్వహణ కోసం తెలుగు రాష్ట్రాలు రూ. 200 కోట్ల చొప్పున డిపాజిట్ చేయాలని కేంద్ర జలశక్తిశాఖ ఆదేశించడం తెలిసిందే. ఈనేపథ్యంలో కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీలు 'డ్రామా' లాడుతున్నాయని సీఎం కేసీఆర్ ఇటీవల వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా బోర్డులు వాటి పరిధిలోని ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమానికి ఇప్పటికే శ్రీకారం చుట్టాయి.
భౌతిక పరిస్థితులు
రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 28 భారీ ప్రాజెక్టులు ఉండగా, 39 మధ్యతరహావి. చిన్నతరహా 46,531 ఉన్నాయి. సాగునీటిపారుదల, ఆయకట్టుశాఖకు దాదాపు 12 రకాల పనులు ప్రభుత్వం అప్పగించింది. మొత్తం 13,473 మంది అధికారులు, ఉద్యోగులు ఈ శాఖలో విధులు నిర్వర్తిస్తున్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, తాగునీరందించడం ఈ శాఖ ప్రధాన బాధ్యతలు.
ఆ రెండు మినహాయిస్తే..
టీఆర్ఎస్ సర్కారు రీడిజైన్ చేసిన కాళేశ్వరం, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను మినహాయిస్తే రెండు దశాబ్దాల క్రితం చేపట్టిన ప్రాజెక్టులేవీ పూర్తిచేయలేకపోయింది.ఉమ్మడి రాష్ట్రంలో 70 శాతానికిపైగా పూర్తిచేసిన ప్రాజెక్టులూ నేటీకీ అలాగే ఉన్నాయి. 13 భారీ ప్రాజెక్టులు, 19 మధ్యతరహా ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నా పనులు పూర్తికాలేదు.
మిషన్ కాకతీయ
అత్యంత ఉత్సాహంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం పనులు ఆశినంత మేర జరగలేదు. మొత్తం 46,531 చెరువులుంటే, అందులో 25,308 చెరువుల పనులు ప్రారంభించి 13,491 చెరువులు మాత్రమే పూర్తిచేయగలిగారు. వీటికి రూ. 2500 కోట్లు ఖర్చుచేశారు.
మధ్యతరహావి అంతే..
ఆదిలాబాద్ జల్లాలో 20 మధ్యతరహా ప్రాజెక్టులు ప్రారంభించి రెండు దశాబ్ధాలు గడిచినా పూర్తికాలేదు. పూర్తిచేసినవాటికి కాలువల్లేక ఆయకట్టు సాగులోకి రాలేదు. చెనాక-కొరాట ప్రాజెక్టును పనులు 2023 నాటికిగానీ పూర్తయ్యే అవకాశాల్లేవు. సాత్నాల ప్రాజెక్టు పూర్తయి 10 ఏండ్లు గడుచినా, 24 వేల ఎకరాలకుగాను కెనాల్స్ పూర్తికాక 10 వేల ఎకరాలకు కూడా సాగునీరందడం లేదు. కడెం రెండోదశలోనే ఉంది. సుద్దవాగు పూర్తయి పదేండ్లయినా కాలువలు నిర్మాణం జరగలేదు. మంచిర్యాల జిల్లాలోని గొల్లవాగు ప్రాజెక్టు పెండింగ్‌లోనే ఉంది. ర్యాలివాగు అర్భనైజేషన్ కింద ఉండగా, నగరీకరణ మూలంగా కెనాళ్లు పూర్తికాలేదు. ప్రాణహిత(వార్ధ) ప్రాజెక్టులో ఎలాంటి కదలికా లేదు. చెలిమెల , వట్టివాగు ప్రాజెక్టుల రెండోదశ పనులూ పెండింగే.
పెండింగ్ ప్రాజెక్టులు
కల్వకుర్తి, బీమా, నెట్టంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల పనులు 2014 నాటికి 70 శాతం పూర్తయ్యాయి. వీటి కింద 8 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. కాగా ఈ ప్రాజెక్టులకు కాల్వలు లేక నీరంతా వృధాగా కృష్ణానదిలో కలుస్తున్నది. ఈ వృధా అయ్యేనీటితో దాదాపు 300 చెరువులను నింపొచ్చని నిపుణులు అంటున్నారు. అలాగే శ్రీరాంసాగర్ రెండో దశ, శ్రీరాంసాగర్ వరద కాలువ, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు, దేవాదుల ప్రాజెక్టు, సీతారామసాగర్, తుమ్మిళ్ల ప్రాజెక్టు, పులిచింతల ఏడమ కాలువ, ఆదిలాబాద్ జిల్లా ప్రాజెక్టుల పనులు దీర్ఘకాలికంగా కొనసాగుతున్నాయి.