Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఈ ఏడాది రాష్ట్ర ప్రజానీకానికి రవాణా తిప్పలు తప్పలేదు. 2020లో కరోనా లాక్‌డౌన్‌తో అవస్థలు పడిన ఈ రంగం 2021లో కూడా కష్టాలను దాటలేకపోగా, కొత్త సమస్యల్ని సృష్టించింది. వాటి పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధి చూపలేదు. ఫలితంగా అవే ఇబ్బందులు కొనసాగుతున్నాయి.
సింగిల్ పర్మిట్ లేదు
పొరుగురాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌తో సింగిల్ పర్మిట్ ఒప్పందం చేసుకోవాలని ప్రయివేటు రవాణా యాజమాన్యాలు ఆరేండ్లుగా మొత్తుకుంటున్నాయి. ఇప్పటికీ ఎలాంటి పురోగతి లేదు. ఈ ఒప్పందం లేకపోవడంతో ఏపీ సరిహద్దుల్లో బోర్డర్ టాక్స్ పేరుతో యాజమాన్యాలపై ఆర్థిక భారం మోపుతున్నారనేది ప్రయివేటు రవాణా ఆపరేటర్ల ప్రధాన ఆరోపణ.
అందని ప్రభుత్వ సాయం
కరోనా తర్వాత రవాణారంగ కార్మికులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం లభించలేదు. ఒక్కో కార్మిక కుటుంబానికి కనీసం రూ.7,500 నగదు బదిలీ చేయాలనే డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోలేదు.
భారమైన పెట్రోల్, డీజిల్
ఈ ఏడాదిలోనే పెట్రోల్, డీజిల్ రేట్లు లీటర్ వంద రూపాయలను దాటేశాయి. ఫలితంగా రవాణారంగం కుదేలైంది. కేంద్రప్రభుత్వం కంటితుడుపుగా పన్నుల్ని తగ్గించుకున్నట్టు ప్రకటించి, రాష్ట్రాలను కూడా పన్నులు తగ్గించుకోమనడం రాజకీయ వివాదానికి కారణమైంది.
కొత్త టీంతో ఆర్టీసీ
సుదీర్ఘకాలం తర్వాత టీఎస్ఆర్టీసీ మేనేజింగ్డైరెక్టర్గా వీసీ సజ్జనార్, చైర్మెన్‌గా బాజిరెడ్డి గోవర్థన్ నియామకం జరిగింది.
బస్సు చార్జీల పెంపు
పెరిగిన డీజిల్ చార్జీల వల్ల సంస్థపై ఆర్థికభారం పడుతున్నదని ప్రభుత్వం, యాజమాన్యం ప్రకటించాయి. ఆర్టీసీ చార్జీలు పెంచకతప్పదని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. ప్రయాణీకులపై దాదాపు రూ.850 కోట్ల మేరకు భారాలు పడేలా ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రతిపాదనలు పంపారు.
పనిభారాలు
ఆర్టీసీ కార్మికులపై పనిభారాలు పెరిగాయి. అవిశ్రాంతంగా కార్మికులకు 18 గంటల డ్యూటీలు వేస్తున్నారు. దీనిపై కార్మిక సంఘాలు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా యాజమాన్యం స్పందించలేదు.
ఫిట్మెంట్లు లేవు
రాష్ట్రం వచ్చిన తర్వాత 2015లో ఒక్కసారే వేతన సవరణ. రెండు ఫిట్మెంట్లు ఔట్. ఐదు విడతల డీఏ బకాయి. రిటైర్డ్ ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్నారు. సీసీఎస్‌కి బకాయిలు ఇవ్వట్లేదు ప్రభుత్వం.
కార్మిక సంఘాలకు నో ఎంట్రీ
టీఎస్ఆర్టీసీలో కార్మిక సంఘాలకు అనుమతి లభించలేదు. రెండేండ్లు సంస్థలో గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికలు ఉండవని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఆ గడువు ఈ ఏడాది డిసెంబర్‌తో ముగిసింది. గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆర్టీసీ పాలకమండలి (బోర్డు)ని ప్రభుత్వం నియమించింది. దానిలో కార్మిక సంఘాల ప్రతినిధులకు అవకాశం కల్పించలేదు.
నో రిక్రూట్మెంట్
ఈ ఏడాది ఆర్టీసీలో ఒక్క రిక్రూట్మెంట్ కూడా జరగలేదు. కనీసం కారుణ్య నియామకాలు కొలిక్కి రాలేదు.
తగ్గిన బస్సులు
కరోనా లాక్డౌన్ కాలంలో నిలిపివేసిన అనేక రూట్లలో బస్సుల్ని తిరిగి పునరుద్ధరించలేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే దాదాపు వెయ్యి బస్సుల్ని తగ్గించారు.
కొత్త బస్సుల ఊసే లేదు
ఆర్టీసీలో కొత్త బస్సుల కొనుగోలు ఊసే లేదు. వాటి స్థానంలో ఇప్పుడున్న అద్దె బస్సులకు అదనంగా మరో 70 బస్సులకు అనుమతి ఇస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. దీన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నాయి.
తార్నాక ఆస్పత్రి
తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలో కొంతమేరకు సేవలు మెరుగుపడ్డాయి. స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ కంపెనీల సామాజిక బాధ్యత నిధుల (సీఎస్ఆర్) ద్వారా ఆస్పత్రిని పునరుద్ధరించారు. దీని నిర్వహణను కార్పొరేట్ ఆస్పత్రులకు అప్పగిస్తున్నారని ప్రచారం జరిగినా, అలాంటిదేం లేదని ఎమ్డీ సజ్జనార్ ప్రకటించారు.