Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోఆపరేటివ్ రిజిస్ట్రార్‌కు హైకోర్టు సూటి ప్రశ్న
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మెదక్ జిల్లా కోనాపూర్ కోపరేటివ్ సొసైటీలో 2.26 కోట్ల మేరకు అక్రమాలు జరిగాయని అసిస్టెంట్ కోపరేటివ్ రిజిస్ట్రార్ గత జూన్ 28న రిపోర్టు ఇస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని హైకోర్టు కోపరేటివ్ రిజిస్ట్రార్‌ను ప్రశ్నించింది. వెంటనే ఆ రిపోర్టుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దాని ప్రకారం సొసైటీ చైర్మెన్ ఎం.దేవేందర్ రెడ్డి (ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి భర్త), సంఘం సీఈవో ఎం.గోపాల్‌రెడ్డిలపై విచారణ చేయడం లేదని పేర్కొంటూ సొసైటీ డైరెక్టర్లు రిట్ దాఖలు చేశారు. దీనిని గురువారం జస్టిస్ టి.వినోద్‌కుమార్ విచారించి, పై ఉత్తర్వులను జారీ చేశారు. విచారణను రెండు నెలలు వాయిదా వేశారు.
కేంద్ర నిర్ణయం చట్ట నిబంధనలకు వ్యతిరేకం: చెన్నమనేని లాయర్ వాదన
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు ద్వంద్వ పౌరసత్వంపై కేంద్ర హౌం శాఖ తీసుకున్న నిర్ణయం చట్టానికి, నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఉందని ఆయన తరపు న్యాయవాది వాదించారు. రమేశ్ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ 2019లో కేంద్ర హౌం శాఖ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలంటూ చెన్నమనేని దాఖలు చేసిన రిట్‌ను గురువారం జస్టిస్ విజరుసేన్‌రెడ్డి విచారించారు. ఆయన పౌరసత్వాన్ని గతంలో కేంద్రం రద్దు చేస్తే హైకోర్టు కొట్టేసిందనీ, చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా మళ్లీ రద్దు చేసిందని న్యాయవాది చెప్పారు. దీనిపై చెన్నమనేనిపై ఓడిపోయిన శ్రీనివాస్ ఫిర్యాదు చేశారన్నారు. చెన్నమనేనికి ఇప్పటికీ జర్మనీ పాస్‌పోర్టు ఉందనీ, అలాంటి వ్యక్తి చట్టసభలో ఉండకూడదని ఫిర్యాదుదారుడు శ్రీనివాస్ లాయర్ వాదించారు.. పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయాలన్నారు. విచారణ వచ్చే నెల చివరి వారానికి వాయిదా పడింది.
రాంచి కేసు....జనవరి మూడుకు వాయిదా
రాంచి ఎక్స్‌ప్రెస్ హైవేస్ లిమిటెడ్ కంపెనీ, బ్యాంకుల నుంచి రూ. 1000 కోట్ల రుణం తీసుకుని వాటిని వేరే ఖాతాలకు మళ్లించిందన్న కేసు విచారణ వచ్చే నెల మూడుకి వాయిదా పడింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మధుకాన్ సంస్థ అనుబంధ కంపెనీకి చెందిన ఆ సంస్థ డైరెక్టర్ కె.శ్రీనివాస్‌రావును రిమాండ్‌కు పంపేందుకు వీలుగా మళ్లీ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో హాజరీకి పర్మిషన్ఇవ్వాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ న్యాయమూర్తిని జస్టిస్ లక్ష్మణ్‌ను హైకోర్టు కోరింది. మొదటిసారి శ్రీనివాసరావును హాజరుపరిస్తే సీఆర్పీసీలోని 41ఎ సెక్షన్ కింద నోటీసు ఇవ్వలేదని చెప్పి కింది కోర్టు రిమాండ్‌కు పంపలేదన్నారు. మనీలాండరింగ్ కేసుల్లో ఆ సెక్షన్ అమలు వర్తించబోదని ఈడీ వాదించింది. ఈడీ అయినా, సీబీఐ అయినా ఆ సెక్షన్ అమలు చేయాల్సిందేనని శ్రీనివాస్‌రావు తరపు లాయర్ వాదించారు. అనంతరం కోర్టు విచారణ జనవరి మూడుకి వాయిదా పడింది. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులకు చెందిన సీబీఐ కేసును కొట్టేయాలని గతంలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ దాఖలు చేసిన రిట్‌ను గురువారం వాపస్ తీసుకుంది. ఆ కేసు వేసిన పారిశ్రామికవేత్త శ్యాంప్రసాద్‌రెడ్డి దాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు న్యాయవాది చెప్పారు.