Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆభరణాలపై ఆశతో హత్య చేసిన దుండగుడు
- ఆలస్యంగా వెలుగులోకి...
నవతెలంగాణ-షాబాద్
ఓ మహిళపై లైంగికదాడి చేసి, ఆమె మీదున్న ఆభరణాలు తీసుకుని దారుణంగా హత్యచేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్‌స్టేషన్‌లో చేవెళ్ల ఏసీపీ రవీందర్‌రెడ్డి, షాబాద్ సీఐ ఆశోక్‌కుమార్ మీడియాకు వివరాలు వెల్లడించారు. షాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చెందిన కామారెడ్డి జయమ్మ(40) శంకర్పల్లి మండలం బుల్కపూర్లో బంధువుల ఇంటి గృహప్రవేశానికి ఈ నెల 20న ఇంట్లో చెప్పి బయలుదేరింది. ఆ రోజు సాయంత్రం వరకు బంధువుల ఇంటికి చేరుకోకపోవడంతో వారు జయమ్మ రాలేదని కుటుంబసభ్యులకు తెలిపారు. కుటుంబసభ్యులు ఎంత వెతికినా కనిపించకపోవడంతో బుధవారం షాబాద్ పోలీస్‌స్టేషన్‌లో జయమ్మ భర్త జంగయ్య ఫిర్యాదు చేశారు. మహిళ అదృశ్య కేసు కింద నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జయమ్మ వెళ్లిన రోజు బస్సు స్టేజీ సమీపంలో ఉన్న సీసీ పుటేజీలను పరిశీలించారు. పోతుగల్ గ్రామానికి చెందిన కేశపల్లి మల్లారెడ్డి బైక్‌పై తీసుకెళ్లినట్టు సీసీ కెమెరాల్లో ఆధారాలు లభించడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.
అప్పులబాధతో బంగారం దోచుకుందామని హత్య
గ్రామానికి చెందిన కేశపల్లి మల్లారెడ్డి అప్పుచేసి నూతనంగా ఇల్లు నిర్మించుకున్నాడు. అప్పిచ్చిన వారు తరుచూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అదే సమయంలో జయమ్మ ఒంటిపై బంగారు నగలు పెట్టుకుని ఊరికి బయలు దేరడం గమనించి అతనికి దురాశ పుట్టింది. దానికి తోడు జయమ్మతో ముందే పరిచయం ఉండటంతో ఆమెను సులభంగా దోచుకోవచ్చని ఆశించాడు. వెంటనే తన ఆలోచనను అమలు చేసేలా పోతుగల్ బస్సు స్టేజీలో ఆమెను చూసిన మల్లారెడ్డి, చేవెళ్లలో బస్సు దిగు.. తాను శంకర్పల్లి వరకు వస్తున్నాను. నిన్ను అక్కడ దింపుతానని చెప్పాడు. జయమ్మ చేవెళ్ల వరకు బస్సులో వెళ్లి అక్కడ దిగిన వెంటనే, ఆమెను తన బైక్‌పై ఎక్కించుకుని ఎన్కెపల్లిలోని మద్యం దుకాణంలో రెండు బీరుబాటిళ్లు తీసుకుని పక్కన పొలాల్లోకి వెళ్లి సేవించారు. మద్యంను ఆమెకు ఎక్కువగా తాగించి, మళ్లీ బైక్‌పై ఎక్కించుకుని పర్వేద వద్ద మళ్లీ మద్యం తీసుకుని, సంగారెడ్డి మండలం చేర్యాల గ్రామ శివారులోని పత్తి పంటలోకి తీసుకువెళ్లి ఆమెకే ఎక్కువగా మద్యం తాగించాడు. మత్తులో ఉన్న ఆమెపై లైంగికదాడి చేశాడు. అనంతరం ఆమె మెడలోని బంగారు పుస్తెలతాడు లాగుతుండటంతో గమనించిన జయమ్మ అరవడం ప్రారంభించింది. వెంటనే ఆమె మెడలో ఉన్న చున్నీ తీసుకుని ఉరి బిగించి, హత్య చేశాడు. అనంతరం మెడలోని బంగారు పుస్తెలతాడు, కమ్మలు, కడియాలు, పట్టగొలుసులు తీసుకుని స్వగ్రామానికి వెళ్లాడు. ఇంటికొచ్చిన తర్వాత 3తులాల బంగారు పుస్తెలతాడును చేవెళ్లలోని ఫైనాన్స్ దుకాణంలో కుదువపెట్టి రూ.91,300 తీసుకుని అప్పుల వారికి కొంత మొత్తం ఇచ్చాడు. నిందితుడి నుంచి రూ. 41 వేల నగదు, కమ్మలు, పట్టగొలుసులు, కడియాలను పోలీసులు రికవరీ చేశారు. మృతురాలి భర్త జంగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, లైంగికదాడి, హత్య, ఆభరణాల దొంగతనం కేసు నమోదు చేసి, రిమాండుకు తరలించినట్టు ఏసీపీ రవీందర్‌రెడ్డి తెలిపారు. మహిళ అదృశ్యం కేసు వచ్చిన వెంటనే చురుకుగా వ్యవహరించి, అత్యంత తక్కువ సమయంలో షాబాద్ సీఐ ఆశోక్, ఇతర సిబ్బంది చేధించడంతో వారిని ఉన్నతాధికారులు అభినందించారు.