Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లినట్టు అనుమానాలు
- సీసీ కెమెరాలను పరిశీలిస్తున్న పోలీసులు
నవతెలంగాణ-బేగంపేట్
బుడి బుడి అడుగులు.. తడబడు మాటలతో అప్పటి వరకు కండ్ల ముందు ఉన్న చిన్నారి కొద్దిక్షణాల్లోనే అదృశ్యమవ్వడం కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు మూడేండ్ల చిన్నారిని కిడ్నాప్ చేశారు. ఈ ఘటన సికింద్రాబాద్ గోపాలపురం పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు పాపను యాక్టివాపై తీసుకెళ్లినట్టు కొందరు స్థానికులు అనుమానాలు వ్యక్తం చేశారు. గోపాలపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉమా- శ్రీనివాస్ కుమార్ దంపతులు ఏడాది కాలంగా రెజిమెంటల్ బజార్లోని ఓ ఇంట్లో రెండో అంతస్తులో అద్దెకుంటున్నారు. వీరికి కొడుకు, కూతురు సంతానం. గురువారం మధ్యాహ్నం సమయంలో ఉమా కొడుక్కు అన్నం తినిపిస్తుండగా.. కూతురు కీర్తన అక్కడే ఆడు కుంటూ ఉంది. ఈ క్రమంలో చిన్నారి కిందికి వచ్చింది. కూతురు కనిపించడం లేదని గమనించిన తల్లి ఇంట్లో వెతికింది. కనబడక పోడంతో కిందికి వచ్చి చూసినా ఆచూకీ లభించకపోవడంతో ఆందోళనకు గురైంది. వెంటనే గోపాలపురం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగి కేసు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. రెజిమెంటల్ బజార్లో రెండు సీసీ కెమెరాలు ఉండగా అవి పనిచేయడం లేదని తెలిసింది. చిన్నారి ఇంటి ఎదుట హోండా యాక్టివా మీద ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు సంచరించినట్టు స్థానికులు చెబుతున్నారు. వారే ఆ చిన్నారిని కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు చిన్నారి కోసం గాలిస్తున్నారు. విషయం తెలుసుకున్న మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక కీర్తన తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. చిన్నారి ఆచూకీ త్వరగా కనుక్కోవాలని పోలీసులను కోరారు.