Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్
నవతెలంగాణ - మర్రిగూడ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ, ఉద్యానవన రంగ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నాయని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలోని గ్రామభారతిలోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన యూనివర్సిటీ అనుబంధంగా ఏర్పాటు చేసిన ఉద్యానవన కళాశాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 2021-22లో రూ.2,250 కోట్లను ఉద్యానవన రంగ అభివృద్ధికి కేటాయించేందుకు ప్రణాళికలు రూపొందించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పచ్చదనాన్ని పెంపొందించేందుకు హరితహారం ద్వారా పెద్దఎత్తున మొక్కలు నాటుతోందని చెప్పారు. వ్యవసాయ ఉద్యాన వన పంటలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందని తెలిపారు. ఉద్యాన కళాశాల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అందుబాటులోకి తేవడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మర్రిగూడలో 95 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయడం పట్ల ఈ సందర్భంగా ఆమె అభినందించారు. రెండో డోస్ తీసుకుంటే మరింత ఉపయోగకరమన్నారు.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధిలో భాగంగా ఇక్కడ కళాశాల ఏర్పాటు చేయడం శుభసూచకంగా భావిస్తున్నామన్నారు. అనంతరం పలువురు గవర్నర్‌కు వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాహుల్‌శర్మ, వి.చంద్రశేఖర్, సూర్యాపేట ఎస్పీ రజేంద్రప్రసాద్, కొండా లక్ష్మణ్‌బాపూజీ విశ్వవిద్యాలయం వీసీ నీరజ ప్రభాకర్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్, ఆర్డీవో గోపిరామ్, జిల్లా ఉద్యాన అధికారిని సంగీతలక్ష్మి, వ్యవసాయ అధికారి శ్రీధర్‌రెడ్డి, తహసీల్దార్ దేశ్యనాయక్, ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్, ఏవో ఆవుల స్పందన, ఎంఈఓ గురువారావ్ తదితరులు పాల్గొన్నారు.