Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్ల అనుకూల బీజేపీని ఓడించాలి : ఎస్వీకే వెబినార్లో ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షులు అశోక్ధావలే
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
నయా ఉదారవాద విధానాల ఫలితంగా దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభంలోకి కూరుకుపోయిందని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) అధ్యక్షులు అశోక్ ధావలే చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కార్పొరేట్లకు అనుకూలంగా చట్టాలు తీసుకొచ్చిన వ్యవసాయ రంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. ఆ పార్టీని ఓడించడం ద్వారానే వ్యవసాయ రంగాన్ని రక్షించుకోగలమని తెలిపారు. అందులో భాగంగానే కనీస మద్దతు ధరల చట్టం చేయాల్సిన అవసరం ఉందనీ, అందుకోసం మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. గురువారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో 'రైతులు, కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరల చట్టం' అనే అంశంపై నిర్వహించిన వెబినార్లో ఆయన మాట్లాడారు. ఎస్వీకే మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్ వినయకుమార్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా అశోక్ ధావలే మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చాక రూ 10.75 లక్షల కోట్ల దేశీయ కార్పొరేట్ల రుణాలను రద్దు చేసిన కేంద్రం...రైతు రుణాలు మాఫీ చేసేందుకు ముందుకు రాలేదని విమర్శించారు. నిధుల కొరత ఉందంటూ కేంద్రం వితండవాదన చేస్తున్నదన్నారు. అధికారంలోకి వస్తే స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని, తద్వారా రైతుల ఆదాయం పెంచుతామని ఎన్నికల సభల్లో మోడీ వాగ్దానం చేశారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం సాధ్యం కాదంటూ బీజేపీ సర్కారు సుప్రీం కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసిందని విమర్శించారు. ఈ క్రమంలో కనీన మద్దతు ధరల బిల్లు, రుణవిమోచన ప్రయివేటు బిల్లులను ఉభయసభల్లో ప్రవేశ పెట్టారని గుర్తు చేశారు. మోడీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచే రైతాంగ పోరాటాలు ప్రారంభమైనట్టు తెలిపారు. భూసేకరణ చట్టం -2013 చట్టానికి తూట్లు పొడించేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను రైతులు నిర్వాసితులు తిప్పికొట్టారని చెప్పారు. అటవీ హక్కుల చట్టం అమలు కోసం మహారాష్ట్రంలో రైతులు నాసిక్ నుంచి ముంబాయికి పాదయాత్ర చేశారనీ, అది ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని గుర్తు చేశారు. దీంతో లక్ష రూపాయల రుణమాఫీకి బీజేపీ రాష్ట్రం అంగీకరించిందన్నారు. మరోవైపు కేంద్రం ...కార్పొరేట్లకు అనుకూలంగా మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందన్నారు. వీటి ప్రమాదాన్ని గుర్తించిన రైతాంగం బీజేపీకి వ్యతిరేక పోరాటం చేసిందన్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది పాటు మొక్కవోని ధైర్యంతో పోరాడి విజయం సాధించిందన్నారు. దేశ స్వాతంత్య్ర పోరాటం తర్వాత అంతటి పోరాటం ఇదేనని చెప్పారు. రైతు పోరాటం సాగు చట్టాలకు వ్యతిరేకమే కాదనీ, సామ్రాజ్యవాద, నయా ఉధారవాద, కార్పొరేట్ విధానాలను తిప్పికొట్టేందుకు జరిగిందన్నారు. రైతులు, కూలీలు, మహిళలు, విద్యార్థులు, యువత, విద్యావంతులు రైతాంగ ఉద్యమానికి సంఘీభావం తెలిపారన్నారు. బీజేపీ అధికారంలోకి ప్రయివేటీకరణ విధానాలను వేగంగా అమలు చేస్తున్నదనీ, దాన్ని తిప్పికొట్టేందుకు ఐక్యపోరాటాలు జరుగుతున్నాయన్నారు. ఆ ఉద్యమ ప్రభావంతో బీజేపీ దేశ వ్యాప్తంగా ఉప ఎన్నికల్లో ఓడిపోయిందన్నారు. కేరళ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎల్డీఎఫ్ రెండోసారి అధికారంలోకి వచ్చిందన్నారు. కేరళ ప్రభుత్వం వరి క్వింటాకు వెయ్యి రూపాయల బోనస్, 16 రకాల పండ్లు, కూరగాయలకు మద్దతు ధరలు నిర్ణయించిందని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా కేరళ మార్గదర్శకంగా నిలిచిందన్నారు.
అత్యధికంగా సాగు ఖర్చులు
వ్యవసాయానికి పెట్టుబడి వ్యయం పెరుగుతున్నదని ధావలే ఈ సందర్భంగా చెప్పారు.విత్తనాలు, పురుగుమందులు,ఎరువులు,పెట్రోలు,డీజీల్,ఉపకరణాల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. అందుకనుగుణంగా రైతులకు గిట్టుబాటు ధరలు అందడం లేదని వివరించారు. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు ప్రయివేటు రుణాలను ఆశ్రయిస్తున్నారనీ, వాటిని తీర్చక లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. 1991 తర్వాత దేశంలో నాలుగు లక్షలకు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అంతకు ముందు అన్నదాతల త్మహత్యలు లేవని తెలిపారు. నయా ఉదార వాద విధానాలు అమల్లోకి వచ్చిన తర్వాతనే ఈ పరిస్థితి దాపురించిందన్నారు.ఈ నేపథ్యంలోనే పెట్టుబడి వ్యయానికి 50 శాతంకలిపి మద్దతు ధరలు నిర్ణయించాలని స్వామినాథన్ కమిటీ చూచిందనీ, వాటిని అమలు చేయడంలో బీజేపీ సర్కారు విఫలమైందని విమర్శించారు.