Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరోగ్యశ్రీ బిల్లుల్లో జాప్యాన్ని నివారిస్తాం : మంత్రి హరీశ్ రావు
- దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆస్పత్రిలో నూతన ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లు ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
ఒమిక్రాన్ నియంత్రణ కోసం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను గౌరవిస్తామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఆదేశాలకు సంబంధించిన కాపీ ఇంకా అందలేదనీ, వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్పందించారు. ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులో జాప్యాన్ని నివారించేందుకు చర్యలు తీసుకుంటామనీ, ప్రతి నెలా బిల్లులు వచ్చేలా చూస్తామని హామినిచ్చారు. ఇప్పటి వరకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రభుత్వాస్పత్రులకే పరిమితం చేశామనీ, అవకాశముంటే ఈ పథకాన్ని దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆస్పత్రికి విస్తరిస్తామని హామి ఇచ్చారు. మెఘా ఇంజినీరింగ్ సంస్థ ఆస్పత్రుల కోసం రూ.కోట్లను ఖర్చు చేసి ప్రజా సేవ చేస్తున్నదని కొనియాడారు. ఇప్పటికే నిమ్స్ ఆస్పత్రిలో క్యాన్సర్ సదుపాయాల కోసం రూ.18 కోట్లు, కోవిడ్-19 తీవ్రంగా ఉన్న సమయంలో 35 లక్షల ఆక్సిజన్ ను ప్రభుత్వానికి అందించిందని గుర్తుచేశారు. దుర్గాబాయి దేశ్‌ముఖ్ పేరుతో కొనసాగుతున్న ఆస్పత్రి అందిస్తున్న సేవలను మంత్రి ప్రశంసించారు. ఆస్పత్రికి అవసరమైన సహాయ, సహకారాలను అందిస్తామని హరీశ్ రావు హామీ ఇచ్చారు.
కేంద్రం స్పందించడం లేదు..
ఫ్రంట్ లైన్ వారియర్లకు బూస్టర్ డోసు, చిన్న పిల్లలకు వ్యాక్సినేషన్ తదితరాంశాలపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన సూచనలపై కేంద్రం స్పందించడం లేదని మంత్రి ఈ సందర్బంగా విమర్శించారు. ఒమిక్రాన్ విషయంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రతి ఒక్కరికీ టెస్టులు చేస్తున్నట్టు తెలిపారు. ఇతర దేశాలు ఇప్పటికే బూస్టర్ డోసు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా కేంద్ర ప్రభుత్వంలో చలనం లేదని చెప్పారు. థర్డ్‌వేవ్‌ను తట్టుకునే విధంగా అన్ని చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఈ నెలాఖరులో ఢిల్లీలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్రం నిర్వహించే సమావేశానికి తాను వెళ్లే అవకాశముందనీ, ఆ సమయంలో కేంద్రంతో వ్యాక్సినేషన్, కోవిడ్ కట్టడిపై చర్చిస్తానని తెలిపారు.