Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వాలకు మాజీ ఎమ్మెల్యే జూలకంటి హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యం కొనకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైతులు దండోరా మోగించడం ఖాయమని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి హెచ్చరించారు. ఈ ఏడాది యాసంగిలో ఉన్న అవకాశాలను బట్టి రైతులు ఇప్పటికే సుమారు 20 లక్షల ఎకరాల్లో వరి పంటకు వరినాట్లు వేశారని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అధిక ఉత్పత్తికి ఎక్కువ అవకాశాలున్నందున రైతులు వినియోగించుకోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరి వేయొద్దని అభద్రతాభావానికి గురిచేస్తున్నాయని విమర్శించారు. కొంతకాలంగా రైతులు, రైతు సంఘాలు, ప్రతిపక్షాలు యాసంగి పంటకు అనుమతించాలని ఆందోళన చేస్తున్నాయని గుర్తు చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వరి వేయొద్దంటూ రైతులపైనే ఒత్తిడి చేసింది తప్ప కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేదని విమర్శించారు. వానాకాలం ధాన్యాన్ని సకాలంలో కొనకపోవడంతో రైతులు బాగా నష్టపోయారని తెలిపారు. కనీసం ధాన్యానికి భద్రత సైతం కల్పించలేదని పేర్కొన్నారు. ఇప్పుడు రైతులు పెద్దఎత్తున వరినాట్లు వేస్తున్న తరుణంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పనిసరై కేంద్రంపై ఒంటరి పోరాటం మొదలు పెట్టిందని వివరించారు. రాష్ట్రంలో రైతాంగం యాసంగి వరిపంటకు అనుమతించాలని కోరుతున్నా టీఆర్ఎస్కు రైతు సంఘాల నాయకులు, ప్రతిపక్ష పార్టీల సహకారం తీసుకోవాలనే చిత్తశుద్ధి లేకపోవడం గమనార్హమని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని పక్షాలనూ కలుపుకొని కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. అఖిలపక్షాన్ని పిలిచి దేశరాజధానిలో తెలంగాణ రైతు గర్జనను వినిపించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ మెడలు వంచేలా బాధ్యత తీసుకోవాలని కోరారు. లేకపోతే రెండు ప్రభుత్వాల రాజకీయ నాటకాలు రైతులు అర్థం చేసుకుని రాబోయే కాలంలో దండోరా వేసి చావుడప్పు మోగించడం ఖాయమని హెచ్చరించారు.