Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
డిస్కంల ఆర్థిక నిర్లక్ష్యాన్ని తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) ఆక్షేపించింది. గడువు ముగిసాక దాఖలు చేసిన 2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల వార్షిక ఆదాయ అవసరాల ప్రతిపాదనలు (ఏఆర్ఆర్) తిరస్కరిస్తూ బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రతి ఆర్థిక సంవత్సర ప్రారంభానికి 120 రోజుల ముందు ఏఆర్ఆర్లు దాఖలు చేయాలని చట్ట నిబంధనల్లో ఉండగా, ఉత్తర, దక్షిణ ప్రాంతాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) దాన్ని అమలు చేయలేదని ఆ ఉత్తర్వుల్లో టీఎస్ఈఆర్సీ చైర్మెన్ టీ శ్రీరంగారావు, సభ్యులు ఎమ్డీ మనోహరరాజు, బండారు కృష్ణయ్య పేర్కొన్నారు. గత నెల 30న డిస్కంలు 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాల ఏఆర్ఆర్లను దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన టారిఫ్ ప్రతిపాదనలు ఇవ్వలేదు. ఈ సందర్భంగా టీఎస్ఈఆర్సీ ఈనెల 20న దీనిపై విచారణ జరిపింది. డిస్కంల సీఎమ్డీలు జీ రఘుమారెడ్డి, ఏ గోపాలరావు హాజరయ్యారు. 2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనలను ఆలస్యమైనా, ఈఆర్సీ స్వీకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. దీన్ని ఈఆర్సీ నిర్ద్వంధంగా తిరస్కరించింది. డిస్కంలు ఇచ్చిన 2022-23 ఆర్థిక సంవత్సర ఏఆర్ఆర్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామనీ, దానికి కూడా టారిఫ్ ప్రతిపాదనలు ఇవ్వాలని ఆదేశించింది. మూడేండ్ల ఫైలింగ్స్ను అడ్మిషన్ దశలోనే తిరస్కరిస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.