Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పల్లెప్రగతి..పల్లె ప్రకృతివనాలు...ప్రత్యేకంగా డంపింగ్‌యార్డులు... ఊరూరికీ శ్మశానవాటికలు...ఇంటింటికీ మిషన్‌భగీరథ నీళ్లు..ఏ ఊరుకెళ్లినా కనిపిస్తున్నవి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించడం వల్ల గ్రామాల్లో కొంతమేర మౌలిక సదుపాయాల కల్పన జరిగినప్పటికీ చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది. ఇదంతా నాణానికి ఓ వైపు నుంచి మాత్రమే కనిపించేది. మరోవైపు తిప్పిచూస్తే గతుకుల రోడ్లు.. సమస్యల కుప్పలు.. సర్పంచ్ల తిప్పలు.. కనీస గౌరవం కోసం ఎంపీటీసీ వెతలు.. సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు పెట్టుకున్న పేదల ఎదురుచూపులు..ఇలా అనేక సజీవ దృశ్యాలు సాక్షాత్కరిస్తున్నాయి.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గ్రామ పంచాయతీలలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీతో పారదర్శకత, సమర్థత, జవాబుదారీ తనం పెంపొందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉన్నట్టు కేంద్రం ప్రకటించింది. 2019-20కిగానూ ఈ పంచాయతీ పురస్కారాన్ని అందజేసింది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ దీన్‌దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తీకరణ్ అవార్డుల్లో 9 ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు, 2 ఉత్తమ మండల పరిషత్, 1 ఉత్తమ జిల్లా పరిషత్ అవార్డులు వరించాయి. వీటితో పాటు మిషన్‌కాకతీయ, స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా రాష్ట్రంలోని పలు గ్రామాలకు అవార్డులు వచ్చాయి. రాష్ట్రానికి అవార్డులైతే దక్కుతున్నాయిగానీ, కేంద్రం నుంచి నిధుల విడుదలతో వివక్ష కొనసాగుతూనే ఉన్నది. యూపీ, బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పోలిస్తే మనకు చాలా తక్కువ వస్తున్నాయి.
సర్కారు ఇస్తున్నది జీతభత్యాలు, కిస్తీలకే..
ప్రతి నెలా రాష్ట్ర సర్కారు రూ. 310 కోట్ల వరకు విడుదల చేస్తున్నా అవి సిబ్బంది జీతభత్యాలు, ట్రాక్టర్ల కిస్తీలు, లైట్లు, నిర్వహణా ఖర్చులకే సరిపోని పరిస్థితి.ఒకవేళ బిల్లులు వచ్చినా జీఎస్టీ పేరిట 12 శాతం, అధికారుల చేతులు తడిపేందుకు 15 నుంచి 18 శాతం పోతున్న దుస్థితి నెలకొంది.
ఎంపీటీసీలకు గౌరవం అంతంతే..
మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకే నయానో, భయాతో ఎంపీటీసీలు ఓటు వేసినప్పటికీ రాష్ట్ర సర్కారుపై నెలకొన్న అసంతృప్తి బుసలుగొడుతూనే ఉన్నది. తమకు కనీస గౌరవం దక్కేలా చూడాలనీ, నిధులు విడుదల చేయాలనే డిమాండ్‌ను బలంగా ఎక్కుపెడుతున్నారు. స్థానిక కోటాలో ఇటీవల ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలకు రాష్ట్ర సర్కారు రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించి ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రూ.250 కోట్లు విడుదల చేసింది. మండల కార్యాలయం, గ్రామపంచాయతీలో ఎంపీపీలు, ఎంపీటీసీలు కనీసం కూర్చునేందుకు కుర్చీలను సర్కారు ఈ ఏడాదీ సమకూర్చలేకపోయింది. దీంతో వారు అవమానభారం భరిం చలేకపోతున్నారు.
రోడ్లు అధ్వాన్నం..ప్రయాణం ప్రమాదమయం
గ్రామాల్లో ఇటీవల కురిసిన వర్షాలు రోడ్లన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లే రోడ్లన్నీ గుంతలమయంగా మారి అధ్వాన్నంగా తయారయ్యాయి. ప్రమాదాలకూ కారణమవుతున్నాయి. అయినా, రోడ్ల బాగుపై పంచాతీయరాజ్ శాఖ ఈ ఏడాది దృష్టి పెట్టలేదనే చెప్పొచ్చు. దీంతో ప్రయాణీకులు తరుచూ ప్రమాదాలకు గురవుతున్నారు.
సర్పంచ్ల నెత్తిన శిరోభారాలు...
గ్రామాభివృద్ధిలో పాలుపంచుకుంటున్న సర్పంచ్‌లు మాత్రం చేసిన అప్పులు తీర్చలేక, వడ్డీలు కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపించింది. అప్పులోల్లకు తమ ముఖం చూపించలేక, వాటిని తీర్చేందుకు సెక్యూరిటీ గార్డులుగా, దినసరి కూలీలుగా మారిన దృశ్యాలు కండ్లారా చూశాం. మంత్రి కేటీఆర్ నాయకత్వం వహిస్తున్న రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని సోమారంపేట సర్పంచ్ వడ్డే ఆనంద్‌రెడ్డి గ్రామాభివృద్ధికి చేసిన రూ.38 లక్షల బిల్లులు రాక, మరోవైపు వైపు వైద్యం కోసం రూ.12 లక్షలకు ఖర్చుచేయడంతో ఆర్థిక ఇబ్బందుల్లోకి కూరుకుపోయి ఆత్మహత్య చేసుకున్న విషయం అందర్నీ కలచివేసింది. సీఎం సొంత గడ్డ అయిన గజ్వేల్ నియోజకవర్గంలో నిధుల కోసం 20 మంది దాకా సర్పంచ్‌లు ధిక్కార స్వరం వినిపిస్తూ ప్రత్యేకంగా భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా 1000 కోట్ల రూపాయలకుపైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం.
పూర్తయినా..ఉపయోగం అంతంతే
పల్లెప్రకృతివనాలు, శ్మశానవాటికలు, డంపింగ్‌యార్డులు దాదాపు అన్ని గ్రామాల్లోనూ పూర్తయినప్పటికీ ఉపయోగంలో ఉన్నవి అంతంతే. అవి ఎక్కువగా పోరంబోకు, చెరువు శిఖం భూముల్లో కట్టడంతో ఈ ఏడాదంతా దాదాపు జలమయంలో చిక్కుకుని ఉన్నాయి. పల్లెప్రకృతివనాల్లో మొక్కలన్నీ నీర్చిచ్చుపట్టి ఎండిపోయిన దుస్థితి నెలకొంది. శ్మశానవాటికలు చెరువులు, కుంటల్లో కలిసిపోయిన పరిస్థితి కనిపించింది.