Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యారంగంపై కరోనా కాటు
- చదవడం, రాయడం మర్చిపోయిన పిల్లలు
- దిగజారిన అభ్యసనా సామర్థ్యం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఈ ఏడాడి విద్యారంగంపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపింది. 2019-20, 2020-21 రెండు విద్యాసంవత్సరాలపాటు విద్యార్థులు చదువును పూర్తిగా మర్చిపోయారంటే అతిశయోక్తి కాదు. గతంలో చదివినవి ఏవీ గుర్తుకు రాని పరిస్థితి నెలకొంది. దీంతో విద్యార్థుల జీవితాలు ఆగమయ్యాయి. విద్యార్థుల అభ్య సనా సామర్థ్యం పూర్తిగా పడిపోయిందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. పదో తరగతిలోపు వారు రాయడం, చదవడం మర్చిపోయినట్టు తేల్చాయి. ఐదో తరగతిలోపు విద్యార్థులైతే పదాలను, ప్రీప్రైమరీ పిల్లలు అక్షరాలను సైతం గుర్తించలేని పరిస్థితికి దిగజారిపోయినట్టు స్పష్టం చేస్తున్నాయి. కరోనా ప్రభావంతో కొందరు విద్యార్థుల మానసిక ప్రవర్తన, క్రమ శిక్షణలోనూ తేడా వచ్చిందని ఉపా ధ్యాయులు వాపో తున్నారు. విద్యా రంగంపై కరోనా ఏ స్థాయిలో ప్రభావం చూపిందో అర్థమవుతున్నది.
ఉపాధ్యాయుల కొరత
ఇంత క్లిష్ట సమయంలో రాష్ట్ర ప్రభుత్వం జోనల్ విధానం ప్రకారం ఉద్యోగులు, ఉపాధ్యాయుల విభజన ప్రక్రియను చేపట్టింది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్నది. విద్యావాలంటీర్లను నియమించలేదు. విద్యార్థులను ప్రభుత్వం గాలికొదిలేసింది. ఒకవైపు కరోనా, ఇంకోవైపు ప్రభుత్వ తీరుతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.
ప్రత్యక్ష బోధన అంతంతే...
గత విద్యాసంవత్సరంలో సెప్టెంబర్ ఒకటి నుంచి 9,10 ఆపై తరగతుల విద్యార్థులకు ఆన్లైన్ తరగతుల బోధనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆన్లైన్ పాఠాలు అందరికీ అర్థం కాకపోవడం, స్మార్ట్ఫోన్లు, ఐపాడ్లు, కంప్యూటర్లు, టీవీలు గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులకు అందుబాటులో లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభమైంది. కరోనా తీవ్రత పెరగడంతో మార్చి 16 నుంచి పాఠశాలలు, 24 నుంచి కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు మూతపడ్డాయి. ప్రత్యక్ష బోధన అంతంత మాత్రంగానే సాగింది. దీంతో విద్యార్థుల చదువులపై తీవ్ర ప్రభావం పడింది.
ఇంటర్ విద్యార్థుల మనోవేదన
ఈనెల 16న ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 4,59,242 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 2,24,012 (49 శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 2,35,230 (51 శాతం) మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలో ఇంటర్ వార్షిక పరీక్షలు జరగలేదు. అప్పుడు ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులను సర్కారు ప్రమోట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులు ఈ ఏడాది అక్టోబర్‌లో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాశారు. ఈ ఫలితాల్లో ఫెయిల్ కావడం, తక్కువ మార్కులు రావడంతో విద్యార్థులు మనోవేదనకు గురయ్యారు.
ఎట్టకేలకు స్పందించిన సర్కారు
ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ కావ డంతో మనస్థాపం చెంది ఇప్పటి వరకు ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నల్లగొండకు చెందిన జాహ్నవి, నిజామాబాద్‌కు చెందిన ధనుష్, జయశంకర్ భూపాలపల్లికి చెందిన వరుణ్, వనపర్తికి చెందిన అనిత ఆత్మహత్య చేసుకున్నారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారించాలనీ, ఫెయిలైన వారిని కనీస మార్కులతో పాస్ చేయాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు, అధ్యాపక సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎట్టకేలు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఫెయిలైన విద్యార్థులందర్నీ పాస్ చేస్తున్నట్టు ప్రకటించింది.