Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర స్థాయి సమావేశంలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దుబ్బుల కొలుపు కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం ఆ కళాకారుల సంఘం రాష్ట్ర స్థాయి సమావేశం మాటూరి దేవేందర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సంఘం గౌరవ సలహాదారు లెల్లెల బాలకృష్ణ మాట్లాడుతూ దుబ్బుల కొలుపు కళాకారులు కరోనా కారణంగా గత రెండేండ్ల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మరో పక్క నిత్యావసర సరుకుల ధరలు వారి ఆదాయాలకు అందనంత దూరంలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కుటుంబాలను పోషించుకోవటమే కష్టంగా మారిందని చెప్పారు. ప్రాచీన కళైన దుబ్బుల కొలుపులో మెలుకువలతో కూడిన ఆధునికతను చేర్చేందుకు ప్రభుత్వం తగిన కృషి చేయాలని కోరారు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న కళాకారులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వారి సంక్షేమానికి వెల్పేర్ బోర్డును ఏర్పాటు చేసి 2022 బడ్జెట్లో రూ.10కోట్లు కేటాయించాలని కోరారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జునగరి దుర్గయ్య మాట్లాడుతూ కరోనా కష్టాల నుంచి తేరుకునేందుకు వీలుగా ప్రతి కళాకారుడి కుటుంబానికి నెలకు రూ. 7500 ఆర్థిక సహకారం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ దుబ్బుల కొలుపు కళాకారుల సమస్యలను శాసన సభలో చర్చించి, వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో సాతకారి నరేష్, జునగరి గణేష్, నారాయణ, మారయ్య, రాజు, స్వామి, సందీప్ తదితరులు పాల్గొన్నారు.