Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లకిë
నవతెలంగాణ-సూర్యాపేట
మహిళల వివాహ వయోపరిమితిని 21 ఏండ్లకు పెంచడం కేంద్ర ప్రభుత్వ కపటత్వానికి నిదర్శనమని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లకిë అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఒక వ్యక్తిని మేజర్‌గా పరిగణించే వయస్సు 18 ఏండ్లుగా ఉందన్నారు. యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీ 1989లో వివాహ వయో పరిమితి 18 ఏండ్లుగా ఉండాలని ప్రతిపాదిస్తూ చేసిన తీర్మానంపై మన దేశం కూడా సంతకం చేసిందన్నారు. ప్రపంచవ్యాప్త అంగీకారానికి ఇప్పుడు విరుద్ధంగా వెళ్లడానికి ప్రభుత్వం చెప్పే కారణాలు ఆమోదయోగ్యంగా లేవన్నారు. ఇది భవిష్యత్‌లో సమాజంపై వ్యతిరేక ప్రభావం చూపుతుందన్నారు. చిన్న వయస్సులో వివాహమై సంతానం కాని స్థితి.. అనారోగ్యం నుంచి యువతులు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, అందుకే వివాహ వయస్సు 21 ఏండ్లకు పెంచుతున్నామన్న కేంద్ర ప్రభుత్వ వాదన సమంజసం కాదన్నారు. పౌష్టికాహార లోపం, మాతాశిశు మరణాల లాంటి ముఖ్యమైన సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం విఫలమైందన్నారు. ఒక వైపు ఆరోగ్యానికి సంబంధించి నిధులు తగ్గిస్తూ.. ఆరోగ్యరంగాన్ని పూర్తిగా ప్రయివేట్ పరం చేస్తుందని విమర్శించారు. ఆహార వస్తువుల ధరలు రోజురోజుకూ పెరగడంతో పేదలకు పౌష్టికాహారం దొరడం లేదన్నారు. మహిళలకు ఆహార భద్రత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతూనే ఉందన్నారు. తద్వారా వారికి పోషకాహారం అందక మాతా, శిశు మరణాలు దేశంలో పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు కావల్సిన విద్య, వైద్యానికి బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. పౌష్టికాహారం, విద్య, వైద్యం, రక్షణ, ఆర్థిక, సామాజిక, సమానత్వం వంటి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. స్త్రీ వివాహ వయస్సు పెంపుపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మేకనబోయిన సైదమ్మ, జిల్లా ఉపాధ్యక్షురాలు మద్దెలజ్యోతి, కొప్పుల రజిత పాల్గొన్నారు.