Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమ్మె నోటీసు
నవతెలంగాణ-సిటీబ్యూరో
వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆస్పత్రుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు జనవరి 5 నుంచి సమ్మె చేయనున్నట్టు ప్రకటించారు. పేషెంట్ కేర్, శానిటేషన్, స్వీపర్స్, సెక్యూరిటీ గార్డులు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని కోరుతున్నా ఏడేండ్లుగా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అందువల్ల సమ్మెకు పిలుపునిచ్చినట్టు తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) హైదరాబాద్ నగర అధ్యక్షులు జె.కుమారస్వామి తెలిపారు. శుక్రవారం గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు సమ్మె నోటీసు అందజేశారు. అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ.. వైద్య విద్య, వైద్య విధాన పరిషత్ పరిధిలోని జనరల్ ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు చాలా కాలంగా ప్రభుత్వం వేతనాలు పెంచడం లేదన్నారు. కరోనా సమయంలో రిస్క్ తీసుకుని సేవలందించినా గుర్తింపు లేదని, అధికారులు, కాంట్రాక్టర్లు ఇచ్చిన హామీలు అమలు కాలేదని చెప్పారు. కార్మిక శాఖ జిఓ నెం.68, ప్రభుత్వం జారీ చేసిన జిఓ నెం.60 అమలుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పీఎఫ్‌లో కాంట్రాక్ట్ సంస్థలు చేస్తున్న అక్రమాలను అరికట్టాలని, కార్మిక, యజమాని వాటాలను సక్రమంగా జమ చేయాలని కోరారు. కార్మిక శాఖ నిర్ణయించబడిన సెలవులతో పాటు ఏడాదికి 24 సీఎల్స్ ఇవ్వాలన్నారు. సిబ్బందికి ప్రతిరోజూ సరిపడా శానిటైజర్స్, మాస్కులు, గ్లౌజులు, పీపీఈ కిట్లు, కరోనా ఇన్సెంటీవ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమ్మె నోటీసు అందజేసిన వారిలో యూనియన్ ప్రధాన కార్యదర్శి సీహెచ్.లక్ష్మి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.వాణి, నాయకులు జె.రమా, యాదమ్మ, అనురాధ తదితరులు ఉన్నారు.