Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితకు ఎస్టీయూ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జిల్లా కేటాయింపుల్లో భాగంగా కౌన్సెలింగ్ ప్రక్రియపై ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు కాకుండా ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకపాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల చేయాలని ఎస్టీయూటీఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని శుక్రవారం ఎస్టీయూటీఎస్ అధ్యక్షులు జి సదానందంగౌడ్, ప్రధాన కార్యదర్శి ఎం పర్వత్‌రెడ్డి నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. నూతనంగా జిల్లాలకు కేటాయించిన ఉపాధ్యాయులతోపాటు ప్రస్తుతం అదే జిల్లాలో పనిచేస్తున్న వారికి బదిలీలు, పదోన్నతులను తక్షణమే చేపట్టాలని సూచించారు. బదిలీల సందర్భంగా ఉపాధ్యాయులకు సర్వీసు పాయింట్లు, స్టేషన్ పాయింట్లు లెక్కించాలని కోరారు. ఒంటరి మహిళలు, వితంతువులు, అనారోగ్య సమస్య గల ఉపాధ్యాయులను ప్రాధాన్యత కేటగిరీలో చేర్చాలని తెలిపారు.
పదోన్నతుల తర్వాతే బదిలీలు చేపట్టాలి : టీపీయూఎస్
పదోన్నతుల తర్వాతే ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని టీపీయూఎస్ అధ్యక్షులు హన్మంతరావు, ప్రధాన కార్యదర్శి నవాత్ సురేష్ డిమాండ్ చేశారు. స్థానికతను కోల్పోయి పక్క జిల్లాకు కేటాయించిన వారు సొంత జిల్లాకు వచ్చేలా ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అన్ని జిల్లాల్లో సీనియార్టీ జాబితాల రూపకల్పనలో వేల మంది సమస్యలు ఉత్పన్నమయ్యాయని తెలిపారు. అవి పరిష్కరించిన తర్వాతే బదిలీలకు సంబంధించి తుది జాబితా తయారు చేయాలని సూచించారు.
టీచర్ల కేటాయింపు జాబితా ఆన్లైన్లో ఉంచాలి : టీఎస్టీయూ
ఉపాధ్యాయుల కేటాయింపు జాబితాలు ఆన్లైన్లో ఉంచాలని టీఎస్టీయూ అధ్యక్షులు ఎండి అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి తెలిపారు. పాఠశాలల చివరి పనిదినం వరకు ప్రస్తుతం పనిచేస్తున్న స్థానంలోనే కొనసాగించాలని కోరారు. విద్యాసంవత్సరం మధ్యలో బదిలీలు చేయొద్దని సూచించారు. ఉమ్మడి జిల్లా పరిధిలో మ్యూచువల్ (పరస్పర) బదిలీలకు అవకాశమివ్వాలని ఎస్జీటీయూ అధ్యక్షులు మహిపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటేశం డిమాండ్ చేశారు. భార్యాభర్తలు ఒకే జిల్లాలో పనిచేసే విధంగా మార్గదర్శకాలివ్వాలని కోరారు.