Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామ పంచాయతీ భవనంలో పెట్టి తాళం వేసిన గ్రామస్తులు
- నాగర్‌కర్నూల్ జిల్లా అంబటిపల్లిలో ఘటన
- కరెంట్ లేక వేరుశనగ పైరు ఎండిపోతుందని ఆగ్రహం
- అధికారుల హామీతో విడుదల
నవతెలంగాణ - మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
వ్యవసాయానికి ఉచిత కరెంట్ సరఫరా చేయకపోవడంతో పైర్లు ఎండిపోతున్నాయని గ్రామస్తులు, రైతులు విద్యుత్ శాఖ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని గ్రామ పంచాయతీ భవనంలో నిర్బంధించి తాళం వేశారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అంబటిపల్లి గ్రామంలో శుక్రవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి..ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులు వరికి బదులు వేరుశనగ పంటను సాగు చేస్తున్నారు. కానీ, కొన్ని రోజులుగా కరెంట్ సరఫరా లేదు. పలుమార్లు అధికారులకు విన్నవించినా స్పందన లేదు. దాంతో ఆగ్రహించిన రైతులు, గ్రామస్తులు గామానికి వచ్చిన లైన్మెన్ బాలస్వామి, లైన్ ఇన్స్పెక్టర్ నిరంజన్ను గ్రామ పంచాయతీ కార్యాలయ భవనంలో నిర్బంధించి తాళం వేశారు. కరెంట్ ఎందుకు సరఫరా చేయరని నిలదీశారు. అనంతరం ప్రధాన రహదారిపై బైటాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతు వెంకటస్వామి మాట్లాడుతూ.. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా తమ పంటలు నష్టపోవాల్సి వస్తోందన్నారు. కరెంట్ సరఫరాను పునరుద్ధరించి.. పొలాలన్నీ నీరు పారేదాకా వదిలేదని భీష్మించుకూర్చుకున్నారు. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ ఏఈ సుధాకర్‌రావు రైతులతో మాట్లాడారు. అచ్చంపేటలోని 139/038 కేవీ సబ్ స్టేషన్‌లోని 50 ఎంవీపీ పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఒక్కోదాన్ని 50 నుంచి 80 ఎంవీపీగా మార్చేందుకు చర్యలు తీసుకున్నామని, గతంలో ఈ విషయాన్ని రైతులకు తెలిపామని, షిఫ్టుల వారీగా ఆయా మండలాలకు కరెంట్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు సహకరించాలని కోరారు. ఈ పనులు పూర్తి కాగానే అందరికీ కరెంట్ అందుబాటులోకి తెస్తామని తెలియజేశారు. దీంతో రైతులు సిబ్బందిని వదిలేశారు.