Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతుసంఘం డిమాండ్
- వ్యవసాయశాఖ కమిషనరేట్ వద్ద ధర్నా
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తామర వైరస్ సోకి దెబ్బతిన్న మిరప పంట రైతులకు ఎకరాకు రూ లక్ష పరిహారం ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. ఈమేరకు శుక్రవారం హైదరా బాద్‌లోని రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయం ముందు రైతుసంఘం నేతలు ధర్నా నిర్వహించారు. దెబ్బతిన్న మిరప పంటను ప్రదర్శించారు. పంట పరిహారం ఇవ్వాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సంద ర్భంగా వ్యవసాయశాఖ అడిషనల్ డైరెక్టర్ విజరుకుమార్‌కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, రాష్ట్ర ఉపాధ్య క్షులు, మాజీ శాసన సభ్యులు నంద్యాల నర్సింహారెడ్డి, ఉపాధ్యక్షులు నున్న నాగేశ్వర్‌రావులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు, వరంగల్, గద్వాల జిల్లాల్లో మిరప పంట వేశారని చెప్పారు. ఈ పంట కోసం రైతులు ఎకరాకు రూ 2 లక్షల నుంచి రూ2.5 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారనీ, ఎకరాకు 20-30 క్వింటాళ్ళ వరకు దిగుబడులు వచ్చే అవకాశం ఉండేందన్నారు. కానీ తామర తెగులు సోకడం వల్ల పంట తీవ్రంగా దెబ్బతిన్నదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపాలని కోరారు. ప్రకతి విపత్తుగా పరిగణించి నష్టపోయిన రైతులకు ఎకరాకు లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో పంట నష్టాన్ని భరించలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాతా, పూత రాకపోవడంతో ఆ పంటను తొలగించి ఇతర పంటలు వేస్తున్నారన్నారు. ఈ పంటలను నమోదు చేసి పరిహారం అందేలా వ్యవసాయశాఖ చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రైతుసంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శులు మూడ్ శోభన్, మాదినేని రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్ వెంకట్రాములు, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు యం ధర్మానాయక్, ఆర్ శ్రీరాంనాయక్, సహాయ కార్యదర్శి భూక్యా వీరభద్రం, రైతు సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు, జిల్లా నాయకులు బండి రమేష్, వాసిరెడ్డి ప్రసాద్, జిల్లా నాయకులు సన్మత్రావు, గంగాధర్, చెరుకుమల్లి కుటుంబరావు, వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు బొప్పని పద్మ, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.