Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్థానికులు, సీపీఐ(ఎం) నిరసన.. నాయకుల అరెస్ట్
- హౌసింగ్ బోర్డు అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
- అంబులెన్స్ అడ్డగింత.. న్యాయం చేస్తామన్న ఎమ్మెల్యే
నవతెలంగాణ- కేబీహెచ్‌బీ
హౌసింగ్ బోర్డు స్థలంలో తవ్విన సెల్లార్ గుంతలో పడి ముగ్గురు బాలికలు ప్రాణం కోల్పోయారు. దీనికి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ స్థానికులు, సీపీఐ(ఎం) నాయకులు ఘటనా స్థలంలో ఆందోళనకు దిగగా.. పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన హైదరాబాద్ కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. కేపీహెచ్‌బీ నాలుగో ఫేజ్‌లో శుక్రవారం రమ్య(7), పర్వేజ్(12), సంగీత(14) కలిసి ఆడుకుంటున్నారు. ఆ సమయంలో అక్కడ హౌసింగ్ బోర్డుకు సంబంధించిన స్థలంలో తవ్విన సెల్లార్ వైపు వెళ్లిన పిల్లలు ప్రమాదవశాత్తు అందులోని నీటిలో పడిపోయారు. ఊపిరాడక మృతిచెందారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని చిన్నారుల మృతదేహాలను బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ఇద్దరు బాలికల మృతదేహాలను బయటకు తీశారు. రాత్రికి మూడో మృతదేహాన్ని కూడా బయటకు తీశారు. అప్పటి వరకు ఆడుకున్న చిన్నారులు.. అంతలోనే విగతజీవులుగా మారటాన్ని చూసి ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. చిన్నారులు మృతదేహాలపై పడి గుండెలు బాదుకుంటున్నారు. స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి.కేపీహెచ్‌బీ ఆర్టీఏ ఆఫీస్ వెనుకగల హౌసింగ్ బోర్డుకు సంబంధించిన స్థలంలో తవ్విన సెల్లార్ గుంతలో చిన్నారుల మృతికి హౌసింగ్‌బోర్డు అధికారుల నిర్లక్ష్యం ఉందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి అండగా సీపీఐ(ఎం) కూకట్పల్లి మండల కమిటీ నాయకులు రోడ్డుపై బైటాయించారు. ఈ సందర్భంగా మృతదేహాలను ఆస్పత్రికి తరలిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. అంబులెన్స్ అద్దాలు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) నాయకులు కె.కృష్ణనాయక్ మాట్లాడుతూ.. నాలుగేండ్లుగా ఈ సెల్లార్ గుంతల్లో నీళ్లు నిలిచి ఉన్న కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని, గతంలో కూడా ప్రమాదాలు జరిగినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ముగ్గురు బాలికల మృతికి హౌసింగ్ బోర్డు అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన చేపడుతున్న కృష్ణనాయక్తోపాటు పలువురు సీపీఐ(ఎం) నాయకులను పోలీసులు అరెస్టు చేసి కేపీహెచ్‌బీ స్టేషన్‌కు తరలించారు. పోస్టుమార్టం కోసం బాలికల మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే కృష్ణారావు హామీ ఇచ్చారు.