Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బుక్ఫెయిర్లో పుస్తకావిష్కరణ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆదివాసీ, గిరిజన చైతన్యం కోసం వీఎన్వీకే శాస్త్రి చేస్తున్న కృషి గొప్పదని పలువురు వక్తలు ప్రసంసించారు. శుక్రవారంనాడిక్కడి హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన (బుక్‌ఫెయిర్) చిందు ఎల్లమ్మ వేదికపై ఆయన రాసిన 'నేను సైతం' పుస్తకాన్ని కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ రియాజ్ ఆవిష్కరించారు. ఆదివాసీ గిరిజనసంఘం ఉపాధ్యక్షులు బండారు రవికుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాంనాయక్, నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ సంపాదకులు జీ విజయారావు, హైదరాబాద్ బుక్‌ఫెయిర్ కార్యదర్శి కోయ చంద్రమోహన్, కవి, రచయిత తంగిరాల చక్రవర్తి, పుస్తక రచయిత భార్య గాయత్రి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజన సాంస్కృతిక అధ్యయన సంస్థ డైరెక్టర్‌గా పనిచేసి, ఉద్యోగ విరమణ చేసిన వీఎన్వీకే శాస్త్రి చెంచులు, కోయలు, గోండులు, లంబాడీలు సహా ఆదివాసీ, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు సహా అన్నింటికీ నడిచివచ్చే సమస్త శాస్త్రం (ఎన్సైక్లోపిడియా) అని కొనియాడారు. ఆయన రచనలు గిరిజన, ఆదివాసీ ఉద్యమాలకు దిక్సూచిలా నిలుస్తాయన్నారు. ఆదివాసీల ప్రేమికుడిగా వారి ప్రేమాభిమానాల్ని చూరగొన్నారని చెప్పారు. అందరూ పనిష్మెంట్లుగా భావించే గిరిజన మూలప్రాంతాలకు బదిలీలు చేయించుకొని, అక్కడి ప్రజలతో మమేకమై, వారి ఉన్నతికి సాధ్యమైనంత సహకారాన్ని అందిస్తూ, విధులు నిర్వర్తించారని తెలిపారు. ఆయన రాసిన 'నేనుసైతం' పుస్తకానికి చెప్పవలసింది అభినందనలు కాదనీ, కృతజ్ఞతలు అనీ కొనియాడారు. పుస్తక రచయిత శాస్త్రి మాట్లాడుతూ గిరిజన యువకులకు రాజ్యాంగం, చట్టాలు కల్పించిన హక్కులు వారికి తెలిపాలనే ఉద్దేశ్యంతోనే తాను తెలుగుభాషలో ఇప్పటికి పది పుస్తకాలు రాసినట్టు వివరించారు. విజ్ఞానం ఓ ఆయుధం అనీ, వ్యవస్థ దానికే భయపడుతుందని విశ్లేషించారు.