Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో ఫెయిలైన విద్యార్థులను కనీస మార్కులో పాస్ చేయడాన్ని విద్యార్థి సంఘాలు స్వాగతించాయి. ఇది తమ పోరాట విజయమని ప్రకటించాయి. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి, టి నాగరాజు, శ్రీనివాస్, బి రాము, అశోక్ స్టాలిన్, శివరామకృష్ణ, పరుశురాం, విజరుఖన్నా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ తప్పేమీ లేదనీ, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించడం సరైంది కాదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ఈ నిర్ణయాన్ని ప్రకటించి ఉంటే విద్యార్థుల ఆత్మహత్యలు జరిగేవి కాదని పేర్కొన్నారు. రాబోయే పరీక్షల కోసం ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఖాళీగా అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలనీ, ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని తెలిపారు. విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు అశోక్‌రెడ్డి కలిసి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఆర్థిక సాయం అందించాలి : చాడ
కరోనా నేపథ్యంలో విద్యార్థులకు జరిగిన అన్యాయం, తల్లిదండ్రుల ఆవేదన, విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో ఫెయిలైన వారిని పాస్ చేస్తున్నట్టు ప్రభుత్వ నిర్ణయాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి స్వాగతించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని కోరారు.
టిప్స్ హర్షం
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ దృష్ట్యా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి సబితా ఇంద్రారెడ్డి మానవీయకోణంలో ఫెయిలైన వారిని పాస్ చేయాలని నిర్ణయం తీసుకోవడం పట్ల తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి (టిప్స్) హర్షం ప్రకటించింది. కొందరు స్వార్థపరులు ఇంటర్‌బోర్డును, ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి అమాయక విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమయ్యారని టిప్స్ కన్వీనర్లు మాచర్ల రామకృష్ణగౌడ్, కొప్పిశెట్టి సురేష్, నగేశ్, రహీం, సమన్వయకర్త ఎం జంగయ్య తెలిపారు.
స్వాగతించిన ఇంటర్ విద్యా జేఏసీ
ఫెయిలైన విద్యార్థులను పాస్ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఇంటర్ విద్యా జేఏసీ చైర్మెన్ పి మధుసూదన్‌రెడ్డి స్వాగతించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు ప్రకటించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు.
ప్రభుత్వానికి ధన్యవాదాలు : టీపీజేఎంఏ
ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఫెయిలైన విద్యార్థులను కనీస మార్కులతో పాస్ చేయాలన్న నిర్ణయం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి టీపీజేఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు గౌరి సతీశ్ ధన్యవాదాలు తెలిపారు. ఆ విద్యార్థులందరూ సెకండియర్ పరీక్షలపై దృష్టి సారించడానికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు.