Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాఠశాలల్లో మౌలిక వసతులు కరువు
- మరుగుదొడ్లు లేక బాలికల అవస్థలు
- దూరం వెళ్లలేక.. నీరు కూడా తాగకుండా ఉంటున్న విద్యార్థినులు
- విద్యాశాఖ మంత్రి ఇలాకాలోనే తప్పని తిప్పలు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2,267 ప్రభుత్వ పాఠశాలల్లో 2,20,356 మంది విద్యార్థులున్నారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యతో పాటు మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఇప్పటికీ కొన్ని పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్ల లేక బాలికలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మాడ్గుల మండలం ఆర్కపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ హైస్కూల్, ప్రైమరీ స్కూల్లో మొత్తం 218 మంది విద్యార్థులున్నారు. ఈ పాఠశాలలకు నాలుగు కిలో మీటర్ల దూరం నుంచి వివిధ తండాల విద్యార్థులు వస్తుంటారు. సుద్ధతండా, పలుగు తండా, మఖ్త తండా, బావోజీ తండాల నుంచి సుమారు 50 మంది విద్యార్థులు వస్తారు. రూ.3 లక్షలు వెచ్చించి మరుగుదొడ్లు నిర్మించారు. వాటికి నీటి సరఫరా లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. దాంతో ఒంటికి, రెంటికి విద్యార్థులు, పాఠశాల సిబ్బంది ఆరు బయటకు వెళ్లాల్సి వస్తోంది. సిబ్బంది అంటే బండిపై వెళ్తున్నామనీ, కానీ విద్యార్థులకు ఆ పరిస్థితి లేకపోవడంతో తోటి విద్యార్థుల ఇండ్లలోకి వెళ్తున్నారని పాఠశాల సిబ్బంది తెలిపారు. నీటి సౌకర్యం లేకపోవడంతో ఇంటి దగ్గరి నుంచి తెచ్చుకున్న ఆఫ్ లీటర్ బాటిల్ నీళ్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో విద్యార్థినులు ఇతర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఇదే విషయమై జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారిని సంప్రదించగా స్పందించడం లేదు. మూత్రశాలలు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామనీ, ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తమ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇంటింటికీ, పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మిస్తామని చెప్తుంది. రాష్ట్రమేమో భగీరథ ద్వారా తాగునీరు అందిస్తామని చెప్తుంది. కానీ ప్రభుత్వాల మాటలు నీటిమీద రాతలుగానే మిగిలాయి. సాక్షాత్తు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఇలాకాలోని పలు పాఠశాలల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంట గంటకు తప్పకుండా నీరు తాగాలని రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలో వాటర్ బెల్ కార్యక్రమాన్ని చేపట్టింది. గంట గంటకు నీరు తాగడం అటుంచి.. మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక ఆరు బయటకు వెళ్లలేక విద్యార్థినులు ఇబ్బందులకు గురవుతున్నారు. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం ఆర్కపల్లి పాఠశాలలో నవతెలంగాణ క్షేత్రస్థాయిలో పరిశీలించగా ఈ వాస్తవ పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి.
బడికి రావాలంటే భయమేస్తోంది..
నేను మూడు కి.మీ దూరంలో ఉన్న సుద్ద తండా నుంచి వస్తున్నా. ఉద యం ఇంటి నుంచి తెచ్చుకున్న వాటర్ బాటిల్తోనే సరిపెట్టుకుంటున్నాం. పాఠశాలలో బాత్రూమ్లు లేక ఇబ్బందులు పడుతున్నాం. మా గోస చూసైనా ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించాలి.
- నందిని, 9తరగతి విద్యార్థిని, సుద్ద తండా
మా బడిని పట్టించుకునే నాథుడే లేడు
నాలుగేండ్ల కింద మరుగుదొడ్లు నిర్మించారు.
వాటిని ఇప్పటికీ ప్రారంభించడం లేదు. సార్లను ఎన్నిసార్లు అడిగినా
బోరు వేస్తే తప్పా మరుగుదొడ్లు ప్రారంభించేందుకు అవకాశం లేదు అంటున్నారు. వెంటనే పాఠశాలలో నీటి సౌకర్యం కల్పించాలి. అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలి.
- నికిత, 8తరగతి, పలుగు తండా