Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమగ్రమైన బదిలీ నిబంధనలు రూపొందించాలి : యూఎస్పీసీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
స్థానిక క్యాడర్లకు కేటాయించిన ఉపాధ్యాయులను పాఠశాలల కేటాయింపు కోసం పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) డిమాండ్ చేసింది. శుక్రవారం హైదరాబాద్లో యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ నాయకుల అత్యవసర సమావేశం జరిగింది. అనంతరం యూఎస్పీసీ నాయకులు కె జంగయ్య, చావ రవి, కె రమణ, మైస శ్రీనివాసులు, ఎం రఘుశంకర్ రెడ్డి, టి లింగారెడ్డి, యు పోచయ్య, డి సైదులు, సయ్యద్ షౌకత్ అలీ, ఎన్ చెన్నరాములు, జాడి రాజన్న, జాదవ్ వెంకట్రావు, కొమ్ము రమేశ్, ఎన్ యాదగిరి, శాగ కైలాసం, సిహెచ్ రమేష్, బి కొండయ్య, ఎస్ మహేష్, సుధాకర్ రెడ్డి, జి విజయసాగర్, హరికిషన్, శ్రీనునాయక్, ఎ గంగాధర్, మసూద్ అహ్మద్, భిక్షపతి, విజయకుమార్, కుర్సం రామారావు, మాళోత్ రామారావు, తాహెర్ అహ్మద్ ఒక ప్రకటన విడుదల చేశారు. సీనియార్టీ జాబితాలను సమగ్రంగా తయారు చేయకుండా, జిల్లాల కేటాయింపులో జరిగిన అవకతవకలను సరి చేయకుండానే నూతన జిల్లాల్లో పోస్టింగ్లు ఇవ్వాలని హడావుడిగా ఆదేశించటం అన్యాయమని విమర్శించారు. మహబూబ్ నగర్, వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో సీనియార్టీ జాబితాల్లో భారీ అవకతవకలు జరిగాయని తెలిపారు. ఇతర జిల్లాల్లో సైతం పలువురు ఉపాధ్యాయులకు అన్యాయం జరిగినట్లు ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఇంకా పలువురికి కేటాయింపు ఉత్తర్వులు అందనేలేదని తెలిపారు. జిల్లాల కేటాయింపులో జరిగిన అన్యాయంపై అప్పీళ్లను, భార్యాభర్తలు ఒకే జిల్లాకు రావాలనే అభ్యర్ధనలను, మ్యూచువల్ (పరస్పర) బదిలీలకోసం అప్పీల్ చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చి రెండు రోజులు గడవకముందే నూతన జిల్లాల్లో పోస్టింగ్లు ఇవ్వాలని ఆదేశించటం సమంజసం కాదన్నారు. ఉపాధ్యాయ సంఘాలతో విద్యామంత్రి నిర్వహించిన సమావేశంలో ఇచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షం గా వ్యవహరించటం సరైంది కాదని తెలిపారు. వితం తువులు, ఒంటరి మహిళలలకు జిల్లాల కేటాయిం పులో ప్రాధాన్యత ఇవ్వలేదని పేర్కొన్నారు. కనీసం పాఠశాలల కేటాయింపులో అయినా ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం తాత్కాలిక(అడ్హక్) పోస్టింగ్లు మాత్రమే ఇచ్చి, అప్పీళ్లను పరిష్కరించిన అనంతరం స్టేషన్ సీనియార్టీ, సర్వీసు సీనియార్టీకి పాయింట్లు కేటా యించి విద్యాశాఖ రూపొందించే మార్గదర్శకాలతో సాధారణ బదిలీలు నిర్వహించాలని కోరారు.