Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫెయిలైన విద్యార్థులకు కనీస మార్కులు.. పిల్లల భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం
- ధర్నాలు చేస్తే పాస్ చేస్తామనుకోవద్దు
- కష్టపడి చదివి పరీక్షల్లో రాణించాలి
- తల్లిదండ్రులు, అధ్యాపకులు ప్రోత్సహించాలి
- మూల్యాంకనం, ఫలితాల్లో ఇంటర్ బోర్డు తప్పులేదు
- ప్రతిదీ రాజకీయం చేయొద్దు
- ఆత్మహత్యలు బాధాకరం : మీడియాతో విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో విద్యార్థులందర్నీ రాష్ట్ర ప్రభుత్వం పాస్ చేసింది. ఫెయిలైన 2,35,230 మంది విద్యార్థులకు కనీస మార్కులతో ఉత్తీర్ణులుగా ప్రకటించింది. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 4,59,242 మంది విద్యార్థులు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యారని చెప్పారు. వారిలో 2,24,012 (49 శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారనీ, 2,35,230 (51 శాతం) మంది విద్యార్థులు ఫెయిలయ్యారని వివరించారు. ప్రభుత్వ కాలేజీల్లో 34 శాతం, బీసీ గురుకులాల్లో 65 శాతం, ఎస్సీ గురుకులాల్లో 66 శాతం, ఎస్టీ గురుకులాల్లో 52 శాతం, మైనార్టీ గురుకులాల్లో 48 శాతం, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో 43 శాతం, తెలంగాణ గురుకులాల్లో 78 శాతం, ప్రయివేటు కాలేజీల్లో 53 శాతం విద్యార్థులు పాసయ్యారని చెప్పారు. అయితే ఫెయిలైన విద్యార్థులకు పది మార్కులు కలిపితే 8,076 మంది, 15 మార్కులు కలిపితే 24 వేల మంది, 20 మార్కులు కలిపితే 58 వేల మంది, 25 మార్కులు కలిపితే 72 వేల మంది, 30 మార్కులు కలిపినా 83 వేల మంది పాస్ అవుతారని వివరించారు. అయినా 1.52 లక్షల మంది పాసయ్యే అవకాశం లేదన్నారు. సెకండియర్ పరీక్షలకు నష్టం రాకూడదనే ఉద్దేశంతోనే ఫస్టియర్‌లో ఫెయిలైన విద్యార్థులందర్నీ కనీస మార్కులతో పాస్ చేయాలని నిర్ణయించామని అన్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలపై విద్యార్థులు ఆలోచిస్తే సెకండియర్ పరీక్షలపై ప్రభావం పడుతుందన్నారు. అందుకే విద్యార్థుల భవిష్యత్తు కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. విద్యార్థులు బాగా ఆలోచించి కష్టపడి చదవాలనీ, మంచి మార్కులతో పరీక్షల్లో రాణించాలని సూచించారు. భవిష్యత్తులోనూ ధర్నాలు చేస్తే తమను పాస్ చేస్తారనే భావనను విద్యార్థులు వారి మనసుల్లోనుంచి తొలగించుకోవాలని అన్నారు. పిల్లలు బాగా చదివేలా తల్లిదండ్రులు, అధ్యాపకులు, ఇంటర్ బోర్డు, ప్రభుత్వం ప్రయత్నించాలనీ, వారిని ప్రోత్సహిం చాలని కోరారు.
నిందలు వేయడం బాధాకరం
రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా ఆలోచించి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించిందని సబితాఇంద్రారెడ్డి చెప్పారు. 70 శాతం సిలబస్‌తో, ఎక్కువ ఆప్షన్లు ఇచ్చి ఇంటర్ బోర్డు రూపొందించిన మెటీరి యల్ను విద్యార్థులకు ఇచ్చామని అన్నారు. చదువుకునేందుకు నెలరోజుల సమయమిచ్చామని గుర్తు చేశారు. విద్యార్థులతో అధ్యాపకులు ఎప్పుడూ అందుబాటులో ఉన్నారని వివరించారు. వారు ఇంకా పదును పెడితేమంచి ఫలితాలు వచ్చేవని చెప్పారు. ఈఫలితాల్లో 10వేల మంది 95 శాతం మార్కులు సాధించారని అన్నారు. విద్యార్థులకు 470కి 467 వచ్చాయని గుర్తు చేశారు. ఇంటర్ బోర్డు తప్పున్నట్టు, ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించలేదన్నట్టు, బోర్డు మీద, ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి కేసీఆర్ మీద నిందలు వేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. జవాబు పత్రాల మూల్యాంకనంతోపాటు ఫలితాల్లో ఎక్కడా ఇంటర్ బోర్డు తప్పులేదన్నారు. అయి నా నిందించడం సరైంది కాదని అన్నారు. రాజకీయ పార్టీలు బాధ్యతగా వ్యవహ రించాలని సూచించారు. ఇంటర్ బోర్డును ముట్టడించడం, ధర్నాలు చేయడం భావ్యం కాదన్నారు. ప్రతిదాన్నీ రాజకీయ లబ్ది కోసం ఆలోచించొద్దని కోరారు.
కనీస మార్కులు నచ్చకపోతే పరీక్ష రాయొచ్చు
ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఫెయిలైన విద్యార్థులు కనీస మార్కులు నచ్చకపోతే వచ్చే ఏడాది వార్షిక పరీక్షలకు హాజరయ్యేందుకు అవకాశముందని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు తిరిగి ఆ డబ్బులు చెల్లిస్తామనీ, ఒకవేళ మార్కులు పెరుగుతాయనుకుంటే ఆ ప్రక్రియను చేపడతామని వివరించారు. విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని అన్నారు. అయితే సవాళ్లను ఎదుర్కోవాలని సూచించారు. గెలుపోటములను సమానంగా స్వీకరించాలని కోరారు. వార్షిక పరీక్షల్లో ఫెయిలైతే సప్లిమెంటరీ ఉంటుందనీ, విద్యార్థులు ఈ దిశగా ఆలోచించి కలలను నిజం చేసుకోవాలని చెప్పారు.
వెంటనే పాస్ చేయాలా?
ఇంటర్ ఫలితాలు ఈనెల 16న విడుదలయ్యాయనీ, ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, ఈ నిర్ణయం ముందుగానే ప్రకటిస్తే బాగుండేది కదా?అన్న ప్రశ్నకు 'ఫెయిల్ అయ్యారు కాబట్టి వెంటనే పాస్ చేయాలా?'అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎదురు ప్రశ్నించారు. విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. విద్యార్థులు ఒత్తిడికి గురికావొద్దని సూచించారు. ఫలితాలు ఎందుకు తగ్గాయన్న ప్రశ్నకు భవిష్యత్తులో మంచి ఫలితాలు వచ్చేలా ప్రయత్నిస్తామని సమాధానమిచ్చారు. విద్యార్థులపై శ్రద్ధ పెట్టి మంచి ఫలితాలు వచ్చేలా ప్రభుత్వం, ఇంటర్ బోర్డు, అధ్యాపకులు కృషి చేస్తారని అన్నారు. మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు క్లినికల్ సైకాలజిస్టులను ఏర్పాటు చేశామన్నారు. కరోనా నేపథ్యంలో విద్యార్థుల కోసం దూరదర్శన్, టీశాట్ ద్వారా పాఠాలు బోధించామని చెప్పారు. వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి విద్యార్థులకు అధ్యాపకులు అందుబాటులో ఉన్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తదితరులు పాల్గొన్నారు.