Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. టిక్కెట్ల ధరలను పెంచడం వల్ల ప్రేక్షకులపై భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో వినోదాన్ని వారికి దూరం చేయడమే అవుతుందని తెలిపారు. ఇప్పటికే టిక్కెట్ ధరలను పెంచిన యాజమాన్యాలకు అదనంగా జీఎస్టీ, నిర్వహణ చార్జీలను వసూలు చేసుకునే అవకాశం కల్పించడం వల్ల ప్రేక్షకులకు మరింత భారమవుతుందని పేర్కొన్నారు. రెండేండ్ల నుంచి కరోనాతో సతమతమవుతున్న ప్రజలకు ఆదాయ మార్గాలు తగ్గాయని వివరించారు. థియేటర్ల యాజమాన్యాలకు కరోనా మూలంగా వచ్చిన ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు ప్రత్యేక రాయితీలను ప్రకటించాలని సూచించారు. నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడనుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. థియేటర్లలో కనీస మౌలిక వసతుల సమస్య ప్రేక్షకులను వెంటాడుతున్నదని తెలిపారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సినిమా టిక్కెట్ల ధరల పెంపును ఉపసంహరించకపోతే పోరాడతామని హెచ్చరించారు.