Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన రిజర్వేషన్లపై కార్యాచరణ లేని వైనం...
- మిగతా కార్యక్రమాలు, పథకాలూ అంతంతే
- ఎస్సీ, ఎస్టీల బతుకులు మారలే
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
షరా మామూలుగా ఈ యేడాది కూడా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు ఒరిగిందేమీ లేదు. సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం కూడా మరో 'డబుల్..' స్కీమ్‌లాగా మారిందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో దళితులకు ఇస్తామన్న మూడెకరాల భూమి హామీ 2021లో కూడా పత్తా లేకుండా పోయింది. గిరిజనులకు పదిశాతం రిజర్వేషన్లను కల్పిస్తామంటూ చెప్పి తీర్మానం చేసి ఢిల్లీకి పంపిన కేసీఆర్.. ఆ మేరకు కేంద్రంపై ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటించకపోవటం గమనార్హం.
అమలు తీరుపై అనుమానాలు...
ఈ యేడాది దళిత బంధుపై ఎస్సీలు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. కానీ దాని అమలు మాత్రం నత్తను తలపిస్తున్నది. హుజూరాబాద్ ఎన్నికల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పినా ఇప్పటికీ సమీక్షల స్థాయిలోనే ఉన్నది. ఈ క్రమంలో దళిత, ప్రజాస్వామిక సంఘాలు ఆందోళనలు, రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూ నడుం బిగిస్తున్నాయి.
ప్రయివేటీకరణపై నిరసనలు...
ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణపై ఈ యేడాది దళిత, గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. పబ్లిక్ సెక్టార్ ధ్వంసమైతే... ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు లేకండా పోతాయనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతున్నది.
ఇప్పటికీ 6,882 మందికే...
వెనుకబడిన ఎస్సీలను అభివృద్ధిలోకి తెచ్చేందుకోసమంటూ 2014 ఆగస్టులో దళితులకు మూడెకరాల భూ పంపిణీ పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది ప్రారంభమై ఏడేండ్లు గడుస్తున్నా ఇప్పటికీ కేవలం 6,882 మందికి 16,418.17 ఎకరాలే పంచటం గమనార్హం.
రుణాలు లేవు, చైర్మెనూ లేడు..
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ రుణాల కోసం సుమారు నాలుగు లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. వారికి రుణాలను మంజూరు చేయటంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటున్నది. ఎస్సీ, ఎస్టీ కమిషన్్కు చైర్మెన్‌ను నియమించకపోవటంలో ఆయా తరగతుల వారి సమస్యలను వినే నాథుడే కరువయ్యాడు.
మూడెకరాలపై మాట మార్చిన సీఎం...
టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికలోని 14వ పేజీలో వ్యవసాయాధారిత ఎస్సీ కుటుంబాలకు మూడెకరాల భూమి ఇస్తామంటూ టీఆర్ఎస్ వాగ్దానం చేసింది. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా తాము అలాంటి హామీలేవీ ఇవ్వలేదంటూ సీఎం కేసీఆర్ శాసనసభలో చెప్పటం గమనార్హం.
పెరిగిన దాడులు...
రాష్ట్రంలో ఈ యేడాది దళితులు, గిరిజనులపై దాడులు, పెత్తందార్ల ఆగడాలూ పెరిగాయి. ఇలాంటివి దాదాపు 30కి పైగా ఘటనలు జరిగాయి. వీటిని నిరసిస్తూ ఆందోళనలు కొనసాగాయి. దీంతో సర్కారు అనివార్యంగా బాధ్యులపై చర్యలు తీసుకోక తప్పలేదు.
ఎస్టీలకూ ఇవ్వలే...
రాష్ట్రంలో గిరిజనులకు కూడా మూడెకరాల సాగు భూమినిస్తామంటూ టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికలో పేర్కొంది ఏండ్లు గడుస్తున్నా..అసలు ఆ పథకాన్ని ఇంకా మొదలు పెట్టకపోవటం గమనార్హం. మరోవైపు ఆదివాసీల నుంచి వేల ఎకరాల పోడు భూములను ఫారెస్టు అధికారులు గుంజుకుంటున్నారు. సాగు చేస్తున్న పంటలను హరితహారం పేరిట స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అనేక జిల్లాల్లో అమాయక గిరిజనులపై కేసులు పెట్టి జైలుకు పంపారు.