Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మనస్తాపంతో రైతు ఆత్మహత్య
నవతెలంగాణ - జూలపల్లి
సన్న వడ్లు కొన్న వ్యక్తి మొత్తం డబ్బులు ఇవ్వకుండా.. పైగా బెదిరించడంతో మనస్తాపానికి గురైన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా జూపల్లి మండలంలో జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దాపూర్ గ్రామానికి చెందిన రైతు పెసరు మొండయ్య(46) కరీంనగర్‌కు చెందిన అశోక్‌రెడ్డి, జూలపల్లికి చెందిన కందూరు సంతాన్రెడ్డి వద్ద బీపీటీ సన్నరకం వరి విత్తనాలు తీసుకుని సాగుచేశాడు. పంట చేతికొచ్చాక గడ్డమీది శీనుగౌడ్ ద్వారా వారికి ఇచ్చాడు. ధాన్యానికి మొత్తం రూ.లక్షా 90వేలు కాగా, 90వేలు మాత్రమే రైతుకు ఇచ్చారు. మిగతా డబ్బులు అడిగితే.. ఇయ్యం.. ఏం చేసుకుంటావో చేసుకో అని వారు బెదిరించారు. దీంతో మనస్తాపం చెందిన మొండయ్య ఈనెల 24న సాయంత్రం పురుగుల మందు తాగాడు. కుటుంబీకులు గమనించి వెంటనే 108 వాహనంలో కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి శనివారం సాయంత్రం మృతిచెందాడు. రైతు భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు జూలపల్లి ఎస్ఐ షేక్ జానీపాషా తెలిపారు.