Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధ్యాయులందరికీ పదోన్నతులు, బదిలీలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చేపట్టాలని ఎస్టీయూటీఎస్ డిమాండ్ చేసింది. శనివారం హైదరాబాద్‌లో ఎస్టీయూటీఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి సదానందంగౌడ్, ప్రధాన కార్యదర్శి ఎం పర్వత్‌రెడ్డి మాట్లాడుతూ జీవోనెంబర్ 317 ప్రకారం నూతన జిల్లాలకు జరుగుతున్న ఉపాధ్యాయుల కేటాయింపు ప్రక్రియలోని అసంబద్ధతలను తొలగించాలని కోరారు. ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా వారి హక్కులను, ప్రయోజనాలకు నష్టం కలిగించేలా నూతన జోనల్ వ్యవస్థలో ఉపాధ్యాయుల కేటాయింపు ప్రక్రియ జరుగుతున్నదని అసహనం వ్యక్తం చేశారు. జిల్లాకో విధానం, సీనియార్టీ జాబితాల్లో తప్పుల తడక, అధికారుల అవగాహన రాహిత్యంతో క్షేత్రస్థాయిలో టీచర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలనీ, జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలివ్వాలని కోరారు. అభ్యంతరాలను పరిష్కరించకుండా కేటాయింపులు చేయొద్దని సూచించారు. సీఎం కేసీఆర్ చొరవ తీసుకుని ఉపాధ్యాయుల కేటాయింపులు, బదిలీలు, పదోన్నతులు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు బి భుజంగరావు, నాయకులు కె సుధాకర్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, శ్రీనివాస్, నారాయణస్వామి, వీరమణి తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులకు ఊహించని బదిలీలు : సీపీఎస్‌టీఈఏ
విద్యాసంవత్సరం మధ్యలో ఉపాధ్యాయులకు ఊహించని విధంగా నూతన జిల్లాలకు సర్దుబాట్లు, బదిలీలు జరుగుతున్నాయని సీపీఎస్‌టీఈఏ అధ్యక్షులు దాముక కమలాకర్ తెలిపారు. కొత్త జిల్లాలకు పంపడం కొంతమంది టీచర్లకు మేలు జరిగితే చాలా మంది జూనియర్లు బలవంతంగా వెళ్లాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. స్థానికత ఉన్న జిల్లాలోని పూర్తి ఖాళీలను భర్తీ చేస్తే వారికీ సొంత జిల్లాలోనే ఉండే అవకాశముంటుందని సూచించారు. భార్యాభర్తల విషయంలో జోన్, జిల్లాతో సంబంధం లేకుండా ఇద్దరినీ ఒకే జిల్లాకు వచ్చేలా సీఎం కేసీఆర్ అవకాశం కల్పించాలని కోరారు.