Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మనుధర్మ శాస్త్రం ప్రతులు దహనం
- రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు
నవతెలంగాణ- విలేకరులు
మనువాదానికి మంట పెడదాం.. సమానత్వాన్ని ఎత్తిపడదాం.. అంటూ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం మనుధర్మ శాస్త్ర ప్రతులను దహనం చేశారు. దేశంలో ప్రజల మధ్య అంతరాలను సృష్టించడానికి, అసమానతలు పెంచడానికి, కుల వివక్షత, అంటరానితనాన్ని ప్రోత్సహించిన మనుధర్మ శాస్త్రాన్ని వ్యతిరేకించాలని నేతలు పిలుపునిచ్చారు. మనుస్మృతిని వ్యతిరేకిస్తూ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ దాని ప్రతులను దహనం చేశారు. అంబేద్కర్ స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నేటి సమాజంలోని ఆధునిక మనువాదానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నూతన విద్య విధానం-2020 పేరుతో విద్యలో మనువాదాన్ని చొప్పిస్తున్నదని, విద్యాకాషాయీకరణకు పాల్పడుతున్నదని ప్రజాసంఘాల నాయకులు అన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీలో మనుస్మృతి ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడారు. మనుస్మతి దహనం పీడిత కులాల ఆత్మగౌరవ పోరాట సంకేతంగా చరిత్రలో మిగిలిపోయిందన్నారు. మనుస్మతి దహనమంటే.. మానవ హక్కుల పునరుద్ధరణే అన్నారు. పీడీఎస్యూ (విజృంభణ) ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట మనుస్మృతి ప్రతులను దహనం చేశారు.దళితుల ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు సింగూరు పాండు ఆధ్వర్యంలో కూకట్పల్లి దయార్గూడలోని అంబేద్కర్ పార్కులో మనుస్మృతి దహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ రాజీవ్ గృహకల్పలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో మనుధర్మశాస్త్ర ప్రతులను దహనం చేశారు.ఖమ్మం జిల్లాలోని రమణగుట్టలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి నందిపాటి మనోహర్ ఆద్వర్యంలో మనుస్మృతి ప్రతులను దహనం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట మనుస్మృతి పత్రులను కాల్చేశారు.పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మనుధర్మ శాస్త్రం ప్రతులను కేవీపీఎస్ ఆధ్వర్యంలో దహనం చేశారు. నల్లగొండలోని భాస్కర్టాకీస్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద కేవీపీఎస్ ఆధ్వర్యంలో మనుస్మృతి ప్రతులను దహనం చేశారు. సూర్యాపేట, మిర్యాలగూడ, చిట్యాలలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో మనుస్మృతి ప్రతులను కాల్చారు.