Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మతోన్మాదులను అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలి
- ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మత మారణకాండకు కుట్రలు చేస్తున్న హిందూత్వ సంస్థల నాయకులు స్వామి ప్రబోధానంద్, ధరమ్‌దాస్, సాధ్వి అన్నపూర్ణ, సురేశ్ చావాంకే, సింధూరాజ్ మహరాజ్‌లను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆవాజ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరిద్వార్‌లో 'ధర్మ సన్సద్' పేరుతో జరిగిన సభలో ముస్లింలను లక్ష్యంగా చేసుకుని హిందూత్వ సంస్థల ప్రతినిధులు చేసిన మత విద్వేష ప్రసంగాలను ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ఖండించాలని కోరారు. వారు చేసిన ప్రసంగాలు భారత రాజ్యాంగానికి వ్యతిరేకమన్నారు. హింసకు పాల్పడాలంటూ మెజార్టీ ప్రజల్ని రెచ్చగొట్టి, దేశంలో మత మారణకాండ సృష్టించి, దేశాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు పన్నుతున్నారని చెప్పారు. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను చంపాలంటూ ఉగ్రవాదాన్ని ప్రేరేపించారన్నారు. ముస్లింలపై దాడులకు తెగబడండంటూ యతి నరసింహానంద, చంపటమో, చావటమో చేయాలనీ, 'ఆయుధాలతో హత్యాకాండకు సిద్ధం కావాలని సుదర్శన్' న్యూస్ ఎడిటర్ ఇన్ చీఫ్ సురేశ్ చావాంకే పిలుపునిచ్చారని గుర్తుచేశారు. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని విమర్శించారు. కేంద్రంలో మోడీ సర్కార్, ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ మద్దతుతోనే హిందూత్వ సంస్థలు ఇలా రెచ్చిపోతున్నాయని ఆరోపించారు. లౌకిక ప్రజాస్వామ్య పార్టీలన్నీ దీనిపై స్పందించాలని విజ్ఞప్తి చేశారు. విచ్చన్న చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు శాబాజ్ ఖాన్, ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అజీజ్ అహమ్మద్ ఖాన్, ఎస్పీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షులు సనావుల్లా ఖాన్, ఆవాజ్ నాయకులు ఫయ్యాజ్, అక్మల్ పాషా, అలీ, హీనా, ఇబ్రహీం, యాకూబ్, ఇమామ్ పాషా తదితరులు పాల్గొన్నారు.