Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 25 ఏండ్లలో బోధన పొందిన వారందరికీ సన్మానాలు
- అరబ్బీ, ఉర్దూ, ఇంగ్లీష్ మాధ్యమాల్లో బోధన
- ఈ నెల 26న సిల్వర్ జుబ్లీ ఉత్సవాలు
- జామే నిజామియా వైస్ ఛాన్స్లర్ ముఫ్తి ఖలీల్ అహ్మద్, ఇతర ప్రముఖుల రాక
నవ తెలంగాణ - మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నెలకొల్పిన మదర్సా ఇస్లామియా ఫజల్ ఉల్ ఉలూం 25 వసంతాలు పూర్తిచేసుకుని సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు సిద్ధమైంది. నాగర్ కర్నూల్ నడిబొడ్డున 1995లో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ అరబిక్ యూనివర్సిటీ జామే నిజామియా ఆధ్వర్యంలో ఈ మదర్సాను నెలకొల్పారు. ఏడుగురు ఫౌండర్ నెంబర్లుగా ఈ బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారు. సొంత స్థలాన్ని కలిగి ఉండి.. దాతల ఆర్థిక సహాయంతో విద్యార్థులు విద్యను అభ్యసించడానికి విశాలమైన భవనాన్ని నిర్మించారు.
రాష్ట్రంలో మదర్సాల నిర్వాహకులు అరబిక్, ఇంగ్లీష్, ఉర్దూ, గణితం తదితర మాధ్యమాల్లో విద్యా బోధన అందిస్తూ.. జామే నిజామియా యూనివర్సిటీలోనే ఆదర్శంగా నిలిచింది. 1995లో మదర్సాను స్థాపించగా.. 1996లో జామే నిజామియా గుర్తింపు లభించింది. ఇప్పటి వరకు మొత్తం 72 మంది విద్యార్థినీ విద్యార్థులు ఖురాన్ గ్రంథాన్ని కంఠస్థం చేసి వివిధ ప్రాంతాల్లో తమ సేవలను అందిస్తూ ఉపాధి పొందుతున్నారు. 72 మంది 53 మంది బాలురు, 20 మంది బాలికలు ఖురాన్ కంఠస్థం చేసిన వారిలో ఉన్నారు. వీరందరికీ జామే నిజామియా ద్వారా డిగ్రీ పట్టాలు అందించారని మజీద్, వక్ఫ్ కాంప్లెక్స్ కమిటీ సభ్యులు తెలిపారు. మదర్సా ఏర్పాటులో ఫౌండర్ కమిటీ సభ్యులైన సయ్యద్ ఉబేదుల్లా హుస్సేనీ, అబ్దుల్ హన్నాన్, సయ్యద్ రఫీ యోద్దీన్, హాబీబ్ ఖాన్, అబ్దుల్ బాసిత్, మహమ్మద్ అలీ, సయ్యద్ షాహాబొద్దిన్ మదర్సా అభివృద్ధికికి బాటలు వేశారు.
నేడు సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు
25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం మదర్సాలో సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సభకు హైదరాబాద్ జామే నిజామియా అరబ్బీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ముఫ్తి ఖలీల్ అహ్మద్, సయ్యద్ సఘీర్ అహ్మద్, హాఫిజ్ రజిఉద్దీన్తో పాటు అనేక మంది ప్రముఖులు హాజరుకానున్నారు.
ఆధ్యాత్మిక.. సాధారణ విద్యపై దృష్టి
సయ్యద్ రఫీయోద్దీన్(మదర్సా కమిటీ కార్యదర్శి)
పాఠశాలలో ఆరబ్బీలో ఆధ్యాత్మిక విద్యతో పాటు ఇంగ్లీష్, తెలుగు, గణితం తదితర మాధ్యమాల్లో విద్యను అందిస్తున్నాం. దాతల సహాయం ఎంతో గొప్పది. ఈ 25 ఏండ్లలో విద్యార్థుల కోసం భవన నిర్మాణం, మజీద్ నిర్మాణం, నిర్వహణ కోసం సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
రాష్ట్రంలోనే ఆదర్శం : మొహమ్మద్ అబ్దుల్ హఫీజ్ ఖాన్
ప్రపంచంలోనే జామే నిజామియా అరబ్బీ యూనివర్సిటీ పేరుగాంచింది. రాష్ట్రంలో నాగర్‌కర్నూల్‌లోని ఫజల్ ఉల్ ఉలూమ్ మదర్సా ఆదర్శంగా నిలిచింది. నాటి నుంచి నేటివరకు నిర్వహణలో ఆదర్శంగా నిలిచింది. తాను వక్ఫ్ కమిటీ కార్యదర్శిగా ఉన్న సమయంలో ఈ మదర్సాకు వక్ఫ్ గ్రాంట్ మంజూరు చేశారు.
ఉపాధిపై దృష్టి అబ్దుల్లాఖాన్ - వక్ఫ్ కాంప్లెక్స్ కమిటీ కార్యదర్శి
ఇస్లామిక్ విద్యతో పాటు ఉపాధి లభించే విధంగా విద్యా బోధనపై దృష్టి సారించాలి. సాధారణ విద్యతో ఇతర మాధ్యమాల్లోని విద్యార్థుల వలే ఉపాధి లభిస్తుంది. సైన్స్, కంప్యూటర్, గణితంను బోధించడం ద్వారా ఉపాధి సాధ్యం అవుతోంది.