Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇవే మనుధర్మ లక్ష్యాలు...
- సమానత్వం కోసం ఉద్యమించాలి
- మనుస్మతి పత్రాలు దహనంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి
- అసమాన అధర్మమే ఆర్ ఎస్ ఎస్ అసలు సిద్ధాంతం: టి స్కైలాబ్ బాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలోని పీడిత జనాలకు చదువు, సంపదలను దూరం చేసిన మనుస్మృతి అసలు లక్ష్యం అణిచివేత అన్యాయమేనని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. అంబేద్కర్ కలలుగన్న సమానత్వ సమాజానికి మనుస్మృతి తీవ్ర ఆటంకమని చెప్పారు. శనివారం హైదరాబాద్లోని బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద కేవీపీఎస్ ఆధ్వర్యంలో మనుస్మృతి పత్రాలను దహనం చేశారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ మూడు వేల సంవత్సరాలుగా సాటి మనిషిని మనిషిగా చూడని గ్రంధం మనుస్మృతి తప్ప ప్రపంచంలో మరొకటి లేదని తెలిపారు. చదువు, సంపద, ఆస్తులు కొద్దిమంది మేలు కోసం కోట్లాది మందిని అది కట్టుబానిసాలుగా చేసిందని విమర్శించారు. ఆర్ ఎస్ ఎస్ మూల సిద్ధాంతమే అసమానత అన్యాయం, అణిచివేతల కలబోతని వివరించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 74ఏండ్లు గడుస్తున్నా..ఇంకా కుల వివక్ష, తక్కువ కులాల వారిపై దాడులు కొనసాగడం అన్యాయమన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై, మహిళలపై, మైనార్టీలపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛ హరించబడుతున్నదని చెప్పారు. ప్రశ్నించటం నేరమైందన్నారు. కలం, గళంపై అప్రకటిత నిషేధం కొనసాగుతున్నదని తెలిపారు. ఆర్ఎస్ఎస్ ఆదేశాలతో బీజేపీ దేశాన్ని నడిపిస్తున్నదనీ, ఆర్ఎస్ఎస్కు మనుస్మృతి ప్రామాణిక గ్రంథమని గుర్తుచేశారు. ఆ నిబంధనలను అమలు చేయించటమే ప్రామాణికంగా బీజేపీ పనిచేస్తున్నదని విమర్శించారు. దేశంలో మతసామరస్యం లేకుండా పోయిందని చెప్పారు. లౌకిక విలువలను పాతరేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఫాసిస్టు చర్యలకు వ్యతిరేకంగా వామపక్ష, ప్రజాతంత్ర, సామాజిక సంఘాలు పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ధర్మం పేరుతో సాగుతున్న అనాగరిక చర్యలను ఖండించాలన్నారు.
ఆలిండియా కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి మనుస్మతి పత్రాలకు నిప్పంటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశాన్ని ముందుకు తీసుకుపోవటం గాకుండా తిరిగి వెనక్కి తీసుకెళ్లే చర్యలకు మోడీ ప్రభుత్వం పాల్పడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు మాట్లాడుతూ మహారాష్ట్ర లోని మహద్ పట్టణం చౌదర్ చెరువులో మంచినీళ్లకోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నడిపిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. రాజ్యాంగం పై ప్రమాణం చేసిన మనువాద శక్తులు ఆ రాజ్యాంగానికే తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. బీజేప, ఆర్ ఎస్ ఎస్ విధానాలకు వ్యతిరేకంగా సమానత్వ సాధన కోసం ఉద్యమించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహరెడ్డి, రైతుసంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జంగారెడ్డి, టి సాగర్, గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్ శ్రీరాం నాయక్ డి వై ఎఫ్ ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ టీపీఎస్కే రాష్ట్ర నాయకులు భూపతి వెంకటేశ్వర్లు సమత, బుడిగ జంగాల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కడమంచి రాంబాబు, రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఎం శోభన్, కేవీపీఎస్ నగర అధ్యక్షులు కె యాదగిరి, జిల్లా నాయకులు ఎం దశరద్ తదితరులు పాల్గొన్నారు