Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'సంపన్నులు పైపైకి...సామాన్యులు అధోగతికి' పుస్తకావిష్కరణలో బీవీ రాఘవులు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అసమానతలు తగ్గితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని సీపీఐ(ఎం) పోలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో సంపద పోగుపడుతున్నదనీ, అది సామాన్యులకు అందట్లేదని ఆందోళన వ్యక్తంచేశారు. దేశంలో అదానీ, అంబానీల ఆస్తుల పెరుగదలపైనే రోజువారీ చర్చ జరుగుతున్నదనీ, రోజుకు లక్షల కోట్ల సంపద వారికి ఎలా పెరగుతున్నదో ప్రజలు పరిశీలన చేయాలని చెప్పారు. నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ ఆధ్వర్యంలో శనివారంనాడిక్కడి హైదరాబాద్ నేషనల్ బుక్‌ఫెయిర్ చిందు ఎల్లమ్మ వేదికపై పలువురు ప్రముఖులు రాసిన వ్యాసాల సంకలనం 'సంపన్నులు పైపైకి-సామాన్యులు అధోగతికి' పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగినప్పుడు ఉద్యమాలు వస్తాయనీ, దేశంలో ఇప్పుడదే జరుగుతున్నదని రైతు ఉద్యమాన్ని ఉదహరించారు. ఉత్పత్తి పెరిగి, సంపద కొద్దిమంది చేతుల్లోనే ఉంటే, వస్తు గిరాకీ దెబ్బతింటుందన్నారు. అమెరికా వంటి తక్కువ జనాభా ఉన్న దేశంలో కూడా సంపద కొందరి చేతుల్లోనే కేంద్రీకృతమై ఆక్యుపై వాల్‌స్ట్రీట్ వంటి ఉద్యమాలు పుట్టుకొచ్చాయని ఉదహరించారు. ఆర్థిక అసమానతలను వ్యతిరేకిస్తేనే సమాజం పురోగమిస్తుందనీ, ప్రశ్నించడాన్ని పెట్టుబడిదారీ శక్తులు సహించలేకపోతున్నాయని చెప్పారు. భారతదేశంలో ఉత్పాదకతలో మహిళల శక్తిని తక్కువ అంచనా వేస్తున్నారన్నారు. దీనికి కులవ్యవస్థే కారణమన్నారు. కులవ్యవస్థలో పనిని అసహ్యించుకుంటారనీ, పనికి గౌరవం, ఆదరణ లేకుంటే ముందుకు సాగలేమని వివరించారు. స్వదేశీ శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోలేకపోతున్నామన్నారు. ఫలితంగా భారతీయులు విదేశాల్లో ఉన్నత స్థాయిని అందిపుచ్చుకుంటున్నారంటూ పలు విదేశీ కంపెనీల భారతీయ సీఈఓల పేర్లను ప్రస్తావించారు. దేశంలోని అట్టడుగు వర్గాల ప్రజానీకానికి పౌష్టికాహారం, వైద్యం సక్రమంగా అందాలనీ, స్త్రీ, పురుష సమానత్వం సాధించాలని చెప్పారు. సమజంలో సగభాగంగా ఉన్న 50 శాతం మహిళలు ఉత్పాదకతకు దూరంగా ఉంటే అభివృద్ధి సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాశక్తి మాజీ సంపాదకులు, రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి మాట్లాడుతూ పుస్తకాలు మనిషిని చైతన్యపరచడానికీ, ఉద్యమాల రూపకల్పనకు దోహదం చేస్తాయని చెప్పారు. అప్పట్లో విద్యుత్ ఉద్యమం ఓ సంచలనం అయితే, మళ్లీ 20 ఏండ్ల తర్వాత ఢిల్లీ రైతాంగ ఉద్యమం చారిత్రాత్మకమైందని అన్నారు. దేశంలో 30 ఏండ్ల సరళీకరణ ఆర్థిక విధానాల అమలును సింహావలోకనం చేసుకోవాలని చెప్పారు. ఈ కాలంలో సరళీకరణ, గరళీకరణంగా మారిందని విమర్శించారు. సంపన్నులు మరింత సంపన్నులు అయ్యారే తప్ప, సామాన్యులకు ఒరిగిందేంలేదన్నారు. కరోనా తర్వాత ఇప్పటికీ 80 శాతం ఉద్యోగులు అంతకు పూర్వం ఉన్న వేతనాలను అందుకోలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో అసమానతలు, ప్రజాస్వామ్యంపై దాడి పెరిగాయనీ, ప్రశ్నించే గొంతులపై ఆంక్షలు విధిస్తున్నారని తెలిపారు.
సరళీకరణ పేరుతో సంస్థల్ని కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నారనీ, ఫలితంగా దేశ జీడీపీలో 89 శాతం అప్పు మిగిలిందని విశ్లేషించారు. సరళీకరణ ఆర్ధిక విధానాలు గొప్పవైతే దేశంలో నాలుగు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారనీ, పండించిన ధాన్యం కొనుగోలు చేయమని కేంద్రాన్ని ఎందుకు అభ్యర్థిస్తారని ప్రశ్నించారు. కార్యక్రమానికి హైదరాబాద్ జాతీయ పుస్తకప్రదర్శన కార్యదర్శి కోయ చంద్రమోహన్ అధ్యక్షత వహించారు. అనంతరం తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరి గౌరీశంకర్, బీవీ రాఘవులు నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ 2022 వాల్ కేలండర్‌ను ఆవిష్కరించారు. నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ ఎడిటర్ జీ విజయరావు, బాధ్యులు డి కృష్ణారెడ్డి, కవి, రచయిత తంగిరాల చక్రవర్తి, పుస్తక అనువాదకులు కొండూరి వీరయ్య తదితరులు పాల్గొన్నారు.