Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధం
- జనవరి2 వరకు ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఒమిక్రాన్ నియంత్రణ చర్యలకు ఉపక్రమించింది. విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం జనం గుమికూడకుండా పలు ఆంక్షలు విధించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం ఉత్తర్వులు విడుదల చేశారు. జనవరి 2వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగసభలు నిషేధించారు. కోవిడ్ నిబంధనలు విధిగా పాటించే కార్యక్రమాలకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. ఆయా కార్యక్రమాలు జరిగే వేదిక వద్ద భౌతికదూరం తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలి. వేదికల ప్రవేశద్వారాల వద్ద థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేసి వ్యక్తుల శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించాల్సి ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించే విషయమై గతంలో జారీ చేసిన ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాలని, మాస్కు లేకుంటే ఫైన్ విధించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. తాజా ఉత్తర్వులను పూర్తి స్థాయిలో అమలు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలను ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో ఒమిక్రాన్ తీవ్రత పెరుగు తోందని.. ప్రభుత్వ, రాజకీయ కార్యక్రమాలు, సంప్రదాయ వేడుకల్లో మాస్కులు ధరించడం వంటి కనీస జాగ్రత్తలు పాటించడం లేదని రవిచందర్, చిక్కుడు ప్రభాకర్, పవన్ కుమార్ తదితర న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రానున్న రోజుల్లో పలు ఉత్సవాల్లో జనం భారీగా గుమిగూడే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి వేడుకలను నియంత్రించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆంక్షలు విధించింది.