Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుప్పలపై కూలుతున్న కర్షకులు
- వరికి ఉరే' అన్న సీఎం వ్యాఖ్యలపై దుమారం
- 'రైతుబంధు' ఎందుకనే లీకులు!
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అసలే కష్టాలు. రైతుశ్రమకోర్చి పండించిన పంట చేతికొస్తుందో, లేదోనన్న ఆవేదనే వెంటాడింది. ప్రతిఫలం పొందేదాక అన్నదాతకు గ్యారంటీ లేకపోయింది. తొలకరిలో విత్తనమేసిన తర్వాత వానలు ముఖంచాటేశాయి. దీంతో మొలకలు పూర్తిగా ఎండిపోయాయి. దీని ఫలితంగా రైతులు రెండోసారి విత్తనాలు వేయాల్సిన దుస్థితి ఏర్పడింది. విత్తిన తర్వాత మూలిగే నక్కపై తాటికాయపడినట్టుగా ప్రకృతి వైపరీత్యాలు వెంటాడాయి. పంటలను పూర్తిగా దెబ్బతీశాయి. పొట్టదశలోనే పంటలు నీళ్లలోనే మురిగిపోయాయి. కండ్ల ముందే పంట పాడైపోతుంటే, రైతు పరిస్థితి అరణ్యరోదనగా మారింది. పాలకులు అటువైపు చూడలేదు. కనీసం పంటనష్టాన్ని కూడా అంచనా కూడా వేయలేదు. రైతులకు పెట్టుబడి రాలేదు. పరిహారమూ దక్కలేదు. దీంతో వ్యవసాయం ఈఏడాది అన్నదాతలకు కన్నీళ్లే మిగిల్చింది.
దెబ్బతీసిన భారీ వానలు
తొలకరి సకాలంలోనే రైతులను పలకరించింది. ఆ తర్వాత ఎక్కిరించింది. కుండపోత వర్షాలు పడ్డాయి. చెరువులు, కుంటలు పొంగిపొర్లాయి. వరదల్లో పంటలు కొట్టుకపోయాయి. పొలాల్లో నీళ్లునిలిచి, వ్రేళ్లు మురిగిపోయి పంట నాశనమైంది. పత్తి, వరి, మొక్కజోన్న, పెసర, సోయా, కూరగాయలు, నూనేగింజనులు పంటలు చేతికందకుండా పోయాయి.ఫలితంగా 20వేల ఎకరాల్లో పంట నష్టపోయింది. గతేడాది కూడా 7 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయింది. ఆ తర్వాత పొటేత్తిన గులాబ్ తుఫాన్ అన్నదాతను మరింత ఆగం చేసింది. పత్తి, పసుపు, పొగాకు వంటి వాణిజ్య పంటలు నాశనమయ్యాయి.
పంటనష్టం లేదంటూ కోర్టుకు అఫిడవిట్
లక్ష ఎకరాల్లో పంటలు దెబ్బతిని రైతులు ఆవేదన చెందారు. రైతులను ఆదుకోవాల్సిన సర్కారు...వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా పంటలు దెబ్బతినలేంటూ టీఆర్ఎస్ సర్కారు కోర్టులో ఆఫిడవిట్ దాఖలు చేయడం గమనార్హం. పంట నష్టపోలేదంటే, పరిహారం ఇవ్వకుండా తప్పించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. 14వ, 15వ ఫైనాన్స్ కమిషన్ సాయాన్ని కూడా కోరలేదు. దీంతో రైతులు అన్ని విధాల నష్టపోయారు. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు..మరోవైపు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులు అతలాకుతలమయ్యారు.
వరికి ఉరి?
యాసంగిలో వరి వేస్తే రైతులకు ఉరి తప్పదం టూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపా యి. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నా రు. యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవు, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెట్టబోమంటూ బహిరంగంగానే ప్రకటించారు. రైతుబంధు నిలిపి వేస్తామని బెదిరించింది. అయినా రైతులు 30 లక్షల ఎకరాల్లో వరి వేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సర్కారు చెప్పింది. ఎలాంటి ప్రోత్సహకాలు ప్రకటించలేదు. పంటలమార్పిడి గురించి మాటలు చెప్పడమే తప్ప వారికి భరోసా ఇవ్వలేదు.
ఉపకరణాల ఊసేలేదు
వ్యవసాయంలో యంత్రీకరణ అవశ్యకత పెరు గుతున్నది. కూలీల కొరత కూడా వెంటాడు తున్నది. ఈ క్రమంలో రైతును ఆదుకోవడంలో వైఫల్యం కనబడుతున్నది. యంత్రీకరణను ప్రోత్సహించేలా సర్కారు...కార్యచరణ లేదు. ముఖ్యంగా సన్నచి న్నకారు రైతులను ఆ దిశగా ప్రోత్సహించలేదు. రైతు బంధు ఇస్తున్నామనే ధోరణితో చాపకిందనీరులా అన్ని రకాల సబ్సిడీలను తగ్గించింది. ఉపకరణాలు, డ్రిప్ ఇరిగేషన్, విత్తనాల సరఫరా, ఎరువులు సబ్సిడీ వంటి సౌకర్యాలను తొక్కిపట్టింది.
ఉద్యాన పంటలకు ప్రోత్సహమేది?
ఉద్యానవన పంటలను ప్రోత్సహించండలో నూ నిర్లక్ష్యం ఉన్నది. పండ్లు, కూరగాయల సాగుకు ఎలాంటి ప్రోత్సహం లేదు. అసలు నిధులే లేవు. గొప్పగా ప్రారంభించిన పాలీహౌస్ నిలిపేసింది. ప్రస్తుతం ఆయిల్‌పామ్ సాగుపై దృష్టి సారించింది. కేవలం పెద్ద రైతులు, కంపెనీల కోసమే ఈ పంటను ప్రోత్సహిస్తున్నారే విమర్శలొస్తున్నాయి.
ఆందోళనతో ఆత్మహత్యలు
రైతుబంధు, రైతుబీమా పథకాలతో రైతు ఆత్మహత్యలు ఆగిపోయినట్టు ప్రభుత్వం గొప్పగా చెప్పింది. కానీ రాష్ట్రంలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉన్నది. గతంలో పొల్లాల్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యలు కొనసాగేవి. ప్రస్తు తం కండ్ల ముందు పంటను కొనకపోవడంతో ఆందోళన చెందిన రైతులు గుండెలు ఆగిపోతున్నాయి. కొనేందుకు టోకెన్లు తీసుకోవాలంటూ ఒత్తిడి కూడా పెరిగింది. వరి కుప్పలపైనే ప్రాణాలు వదులుతున్నారు. రైతు పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యిలా తయారైంది. మొత్తంగా ఈఏడాది క్రైమ్బ్యూరోరికార్డు ప్రకారం 802 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవల దాదాపు 250 మంది రైతులు మరణించారు. వీరే కాకుండా కౌలు రైతుల చావులు సర్కారు లెక్కలోకి తీసుకోవడం లేదు. అసలు కౌలు రైతుకు అన్ని విధాలుగా నష్టపోతున్నారు. పెట్టిన పెట్టబడి తీరాలి.తప్పకుండా కౌలు చెల్లించాల్సి వస్తున్నది. దీంతో కౌలు రైతులే ఎక్కువగా చనిపోతున్నారు.