Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నూతన జాతీయ విద్యావిధానంపై సందేహాలను నివృత్తి చేయాలి : ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్
- ట్రస్మా ఆధ్వర్యంలో ఈడీఈఎక్స్-2021, స్కూల్ లీడర్ షిప్ సమ్మిట్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విద్యాభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్య సంఘం(ట్రస్మా) ఆధ్వర్యంలో ఈడీఈఎక్స్-2021, స్కూల్ లీడర్షిప్ సమ్మిట్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ..కరోనా కారణంగా దేశవ్యాప్తంగా తీవ్ర అభ్యసన నష్టం జరిగిందని పేర్కొన్నారు. ఈ నష్టాన్ని పూడ్చేందుకు వచ్చే విద్యా సంవత్సరాన్ని ఇవ్వాలన్నారు. దాని కోసం ప్రభుత్వాలు, యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇంకా నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా విధానంపై రాష్ట్రాలకున్న సందేహాలను నివృత్తి చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాభివృద్ధికి కట్టుబడి ఉండాలని బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని సూచించారు. గతంలో నేర్చుకున్న చదువునంతా విద్యార్థులు కరోనా కాలంలో మర్చిపోయారనీ, గణితం, తెలుగు, ఇంగ్లీష్ సబ్జెక్టులలో బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో బడ్జెట్ పాఠశాలల యాజమాన్యాలు తీవ్రంగా నష్టపోయాయనీ, వాటిలో ఆత్మస్థైర్యం నింపడానికి ట్రస్మా చేస్తున్న కృషి అభినందనీయమని ప్రశంసించారు. కరోనా కారణంగా విద్యా రంగం మాత్రమే ఎక్కువగా నష్టపోయిందని తెలిపారు. రాష్ట్రంలో బడ్జెట్ ప్రయివేటు పాఠశాలలకు త్వరలోనే మంచి రోజులు వస్తాయని ఆకాంక్షించారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలో ప్రయివేటు పాఠశాలలకు భాగస్వామ్యం కల్పిస్తామని హామీనిచ్చారు. మొదటిరోజు కూల్ గుడ్ లీడర్షిప్, నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ, సైకలాజికల్ హ్యాండేడ్ ఎల్ లిటరసీ, నూతన విద్యా విధానం వలన ఎదుర్కొనే సమస్యలు-పరిష్కారాలు అనే అంశాలపై చర్చ జరిగింది.ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్‌రావు, ప్రధాన కార్యదర్శి సాధుల మధుసూదన్, కోశాధికారి రమణారావు, ఈడీఈఎక్స్ -2021 కన్వీనర్ ప్రసాదరావు, కో-కన్వీనర్లు యాదగిరి, సయ్యద్ అహ్మద్, జనార్ధన్, శ్రీకాంత్‌రెడ్డి, బీరప్ప, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వొడ్నాల శ్రీనివాస్, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు,వివిధ జిల్లాల అధ్యక్షులు, ట్రస్మా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఎడ్యుకేషన్ స్టాల్స్ ఏర్పాటు
విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ఉపయోగకరమైన వందలాది ఎడ్యుకేషన్ స్టాల్స్‌ను హైటెక్స్ లో ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్‌లోని ప్రచురణలను బోయినపల్లి వినోద్ కుమార్‌తో పాటు పలువురు వీక్షించారు. ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, యూపీ. మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తదితర రాష్ట్రాల నుంచి ప్రతినిధులు ఈ ఎడ్యుకేషన్ ఎక్స్పో లో పాల్గొన్నారు.